కీరవాణిని విలన్‌గా చేయమంటున్న రాజమౌళి!
సింగర్స్, మ్యూజిక్ డెరైక్టర్స్ వెండితెరపై యాక్ట్ చేయడమనేది అరుదైన విషయమే. కానీ కొన్ని కొన్ని సందర్భాలను బట్టి వాళ్లు కూడా తెరపై కనపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివి కీరవాణి లైఫ్‌లో చాలా ఎక్కువున్నాయి. కీరవాణి పైకి సీరియస్‌గా కనిపిస్తారు కానీ, ఆయనలో చమత్కారం పాళ్లు చాలా ఎక్కువ. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో హుషారుగా కనిపిస్తారు. అందుకే కొంతమంది దర్శకులు కీరవాణిని నటించమని అడగడం, ఈయనేమో సున్నితంగా తిరస్కరించడం జరిగాయి. కానీ కొంతమంది మరీ మొహమాట పెట్టేయడంతో, కీరవాణి తన మొహానికి మేకప్ వేసుకోక తప్పలేదు.
ఆయన మొదట తెరపై కనిపించింది ‘జీవితమే ఒక సినిమా’ అనే సినిమాలో. అందులో ఓ చిన్న వేషంలో కనిపిస్తారాయన. జగపతిబాబు హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడుగారు వచ్చారు’లో ఓ సంగీత విద్వాంసునిగా నటించారు. ‘రక్షణ’లో ‘ఘల్లుమంది బాసూ... గలాసూ’ పాటలో నాగార్జున, రోజాతో పాటు నిర్మాత వెంకట్ అక్కినేని, కెమెరామేన్ తేజ, నృత్యదర్శకుడు ప్రభుదేవాతో పాటు కీరవాణి కూడా కనిపిస్తారు. ‘సమర్పణ’ సినిమాలో ముష్టివాడు పాత్రలో ఆయన నటించారు. హీరో అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతాప్’ అనే తమిళ సినిమాలో ఓ అరనిమిషం పాత్ర చేశారు. ‘మగధీర’లో ‘శుభం కార్డు’ తర్వాత వచ్చే పాటలో యూనిట్ సభ్యులతో పాటు కీరవాణి కూడా కనిపిస్తారు. సరిగ్గా ఆ పాట చిత్రీకరణ సమయానికి ఆయన అమెరికాలో ఉండడంతో, అక్కడ నుంచే వీడియో షూట్ చేసి పంపించారు.
ఇక కీరవాణి వద్దనుకున్నవి, వదిలేసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. కీరవాణి సతీమణి వల్లీకి పోలీసు వృత్తి అంటే ఇష్టం. అందుకేనేమో ఓసారి కీరవాణితో పోలీస్ డ్రెస్ వేయించి తన ముచ్చట తీర్చుకున్నారు. అలా పోలీస్ డ్రెస్‌తోనే కె.రాఘవేంద్రరావు ఆఫీసుకి వెళ్లారు కీరవాణి. రాఘవేంద్రరావు ఆశ్చర్యపోయి ‘‘ఈ డ్రెస్ నీకు బాగుంది. ఇప్పుడు తీస్తున్న ‘ఘరానా బుల్లోడు’ సినిమాలో ఒక పోలీసు పాత్ర ఉంది. నువ్వే చెయ్యాలి’’ అన్నారు. కీరవాణి మొహమాటంగా చూద్దాం...లెండి’’ అన్నారు.
ఆ విషయం కీరవాణి మరిచిపోయారు కానీ, రాఘవేంద్రరావు మరిచిపోలేదు. రాజమండ్రిలో షూటింగ్ ఉంది. రమ్మని కబురుపెట్టారు. కానీ కుదరక కీరవాణి వెళ్లలేకపోయారు. అలా ఆ పాత్ర మిస్సయ్యింది. ‘శ్రీరామదాసు’లో రాళ్లపల్లి వేసిన పడవవాడి వేషం కీరవాణినే వేయమన్నారు. కానీ తనకు నీళ్లంటే భయమని చేయననేశారు కీరవాణి. ‘సొంతవూరు’లో ఎల్బీ శ్రీరామ్ చేసిన పాత్రకు మొదట కీరవాణినే అడిగారు. ‘వేదం’లో కీరవాణి ఓ పాత్ర చేస్తారని మొదట్లో వార్తలొచ్చాయి.ఇవన్నీ ఒకెత్తు అయితే... రాజమౌళికి తన అన్నయ్య కీరవాణితో విలన్ పాత్ర చేయించాలని కోరిక. ‘‘నన్ను విలన్‌గా చేయమని రాజమౌళి ఎప్పుడూ అడుగుతుంటాడు. నాకే ఆసక్తి లేదు’’ అని కీరవాణి చెప్పారు.