
సాక్షి, హైదరాబాద్ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశిఖన్నా నటించిన తొలిప్రేమ చిత్రం సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖులు చాలా బాగుందంటూ కితాబిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, విలక్షణ నటుడు ఆర్. నారాయణమూర్తిలు ఈసినిమా బాగుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్త పరచగా తాజాగా ఈ జాబితాలోకి దర్శక ధీరుడు రాజమౌళి సైతం చేరారు. సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో కితాబిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 'నేను సాధారంగా ప్రేమకథ చిత్రాల అభిమానిని కాదు. కానీ ‘తొలిప్రేమ’ సినిమాను మాత్రం ఎంజాయ్ చేశాను. దర్శకుడు వెంకీ తన తొలి చిత్రాన్ని బాగానే హ్యాండిల్ చేశారు. వరుణ్ తేజ్ రోజు రోజుకి మంచి నటుడిగా ఎదుగుతున్నాడు. రాశీఖన్నా అందంగా కనిపించడమే కాదు, అంతకంటే బాగా నటించింది. ప్రసాద్, బాపినీడు గారికి శుభాకాంక్షలు. సినిమా నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. మంచి విజయాన్ని అందుకున్నారు' అంటూ ప్రశంసించారు.