వంద కోట్ల పారితోషికమా!
భారీ చిత్రాలు కూడా ఈ రోజుల్లో 100 కోట్ల వసూళ్లు సాధించడం కష్టతరంగా మారింది. అలాంటిది ఒక దర్శకుడి పారితోషికం రూ.100 కోట్లు అంటే నమ్మశక్యంగా ఉందా? అయితే నమ్మాల్సిందేనంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అవును అంత పెద్ద మొత్తాన్ని పారితోషికంగా డిమాండ్ చేసిన దర్శకుడు రాజమౌళి అన్న ప్రచారం ప్రస్తుతం మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం బాహుబలి అన్న సంగతిని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని తలదన్నే రీతిలో బాహుబలి-2 చిత్రాన్ని తాజాగా చెక్కుతున్నారు జక్కన్న. వెండితెర అద్భుతంగా ఆవిష్కరిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు.
చిత్ర వ్యాపారం కూడా మొదలైంది. ప్రారంభం అవడమే కాదు ప్రకంపనలు పుట్టిస్తోంది. తమిళనాడు హక్కులు 45 కోట్లకు అమ్మడు పోయినట్లు సమాచారం. అదే విధంగా కేరళ వెర్షన్ హక్కులు 15 కోట్లకు విక్రయించినట్లు సినీ వర్గాల సమాచారం. ఇక ఉత్తరాది హక్కులకు 100 నుంచి 150 కోట్లు వ్యాపారం జరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే దర్శకుడు రాజమౌళి తన పారితోషికంగా తమిళ్, మలయాళం, హిందీ భాషల వ్యాపారంలో 50 శాతం డిమాండ్ చేసినట్లు పరిశ్రమ వర్గాల బోగట్టా. దీన్ని బట్టి చూస్తే ఆయన పారితోషికం రూ.100 కోట్లకు చేరుతుందని టాక్. ఇదే కనుక నిజం అయితే వంద కోట్లు పారితోషికం తీసుకుంటున్న ఏకైక భారతీయ సినీ దర్శకుడు ఎస్‌ఎస్.రాజమౌళీనే అవుతారు.