సూపర్‌గా స్టార్లంతా కలిశారు! | Rajinikanth, Chiranjeevi Reunite At Mohanlal's 80s Actors Party | Sakshi
Sakshi News home page

సూపర్‌గా స్టార్లంతా కలిశారు!

Published Tue, Jan 21 2014 12:26 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Rajinikanth, Chiranjeevi Reunite At Mohanlal's 80s Actors Party

అక్కడ రజనీకాంత్ సూపర్‌స్టార్ కాదు...చిరంజీవి కేంద్రమంత్రి కాదు...
బాలకృష్ణ టాప్ హీరో కాదు...అక్కడికొచ్చిన హీరోలు, హీరోయిన్లు అందరూ 
తమ హోదాల్ని, ఇమేజ్‌లని పక్కనపెట్టేసి ఓ కొత్త ప్రపంచంలోకి ఎంటరయినట్టుగా 
ఎంజాయ్ చేశారు.
 
 
జనవరి 18... చెన్నైలోని ఇంజంబ్బాకం ఈస్టుకోస్ట్‌లోని మోహన్‌లాల్ గెస్ట్ హౌస్... చీకటి ముసురుకునే వేళ  ఆకాశంలోంచి తారలు ఊడిపడ్డట్టుగా దక్షిణాదిలోని నాలుగు భాషలకు చెందిన ఈ అగ్రతారలంతా  ఒక్కమారుగా అక్కడికి చేరుకున్నారు.కరచాలనాలు, కౌగిలింతలు, బోలెడన్ని కబుర్లు, తీపిగుర్తులతో అందరూ నాస్టాల్జిక్ మూడ్‌లోకి వెళ్లిపోయారు.గత నాలుగేళ్ల నుంచీ బ్రేక్ లేకుండా ఈ స్టార్స్ గెట్ టు గెదర్ జరగడం విశేషం!
 
అసలీ గెట్ టు గెదర్‌కి శ్రీకారం ఎలా జరిగిందంటే... 2009లో చెన్నైలో ఓ పెళ్లి వేడుకలో... చిరంజీవి, సత్యరాజ్, రాధిక, సుహాసిని, సుమలత, లిజి... తదితర తారలు పాల్గొన్నారు. అందరూ కలిసి చాన్నాళ్లయ్యిందేమో జోకులు పేల్చుకుని, సరదాగా ఎంజాయ్ చేశారు. ఏడాదికోసారైనా ఇలా అందరం కలుసుకుంటే ఎంత బాగుంటుంది? అనే ఆలోచన లిజీకి వచ్చింది. తన ఆలోచనను ఇతర నాయికలకు చెప్పడం, వారు ఆమోదించడం జరిగింది. ఇక, అందాల తారలు తమ ఆలోచనను రజనీకాంత్, విష్ణువర్ధన్‌లాంటి వారికి చెప్పడం, వారు కూడా ఏడాదికోసారి కలుద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
 
అప్పుడు ఆరంభమైంది ఈ ‘ఎయిటీస్ రీ యూనియన్ క్లబ్’. మొదటి రెండేళ్లు... తారలందరూ కలసి, చెన్నయ్‌లో పండగ చేసుకున్నారు. మూడో సంవత్సరం మాత్రం హైదరాబాద్‌లో చిరంజీవి ఇంట్లో కలుసుకున్నారు. ఆ మరుసటి ఏడాది బెంగళూరులో అంబరీష్, సుమలతల ఆతిథ్యం అందుకున్నారు. ఈ నెల 18న మోహన్‌లాల్ ఇంట్లో ఈ తారల కలయిక జరిగింది. మేజిక్, డాన్స్, జోక్స్ అంటూ.. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఖుష్బూ, జయశ్రీ ఓ క్విజ్ షో నిర్వహించగా, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్ సరైన సమాధానాలు చెప్పి, బహుమతులు పొందారు. ఈ పార్టీలో పాల్గొన్న నాయికలు మోహన్‌లాల్‌కు బహుమతులిచ్చారు. రంగు రంగుల పూలదండలు మెడలో వేసుకుని అందరూ సందడి చేశారు. అందరూ కలిసి ఫొటోలు దిగారు. 
 
వచ్చే ఏడాది జనవరిలో మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నారు. మరో ఏడాది వరకు ఈ మధురానుభూతులను నెమరు వేసుకుంటామని కొంతమంది తారలు తమ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది మీటింగ్ ప్లేస్ ఎక్కడ? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా తారల ఈ రీ యూనియన్ ఆలోచన మాత్రం చాలా బాగుందనే చెప్పాలి. అందరూ తమ తమ హోదాలను మర్చిపోయి, ఆట పాటలతో రీచార్జ్ అయ్యారు. ఈ రీ యూనియన్‌లో పాల్గొన్న తారల్లో రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, అర్జున్, సుమన్, సీనియర్ నరేష్, భాను చందర్, అంబరీష్, మోహన్‌లాల్, జయరామ్, రమేష్ అరవింద్, సుహాసిని, రాధిక, సరిత, సుమలత, లిజి, రాధ, అంబికా, నదియా, రేవతి, ఖుష్బూ, పూర్ణిమ భాగ్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement