చెన్నై సినీ ప్రియులు పేట చిత్రానికే వసూళ్ల పట్టం కడుతున్నారు. అయితే తమిళనాడు వ్యాప్తంగా చూస్తే విశ్వాసం చిత్రానికే కలక్షన్లను ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సినీ ప్రేక్షకుల నాడి పట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఏ చిత్రానికి విజయాన్ని, ఏ చిత్రానికి అపజయాన్ని కట్టబెడతారో చెప్పడం కష్టం.మొత్తం మీద చిత్రాల జయాపజయాలనేవి ప్రేక్షక దేవుళ్ల చేతిలోనే ఉంటుంది. అందుకే సినీ వర్గాలకు సినిమా ఒక జూదం. ప్రేక్షకులకది వినోదం మాత్రమే. అలా వారిని మెప్పించడానికి ఈ పొంగల్ పండగ సందర్భంగా రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అందులో ఒకటి సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రం కాగా మరొకటి అల్టిమేట్‌స్టార్ అజిత్ నటించిన విశ్వాసం. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాలు రెండూ వసూళ్ల మోత మోగిస్తున్నాయి. అయితే ఏ చిత్రం ఎంత సాధిస్తుందన్న వివరాలను తెలుసుకోవాలన్న ఆసక్తి సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ కలగక మానుతుందా? ఇద్దరి అభిమానుల మధ్య పోరు జరగకుండా ఉంటుందా మా హీరో చిత్ర వసూళ్లే ఎక్కువని ఎవరికి వారు గొప్పలు చెప్పుకోకుండా ఉండడం సాధ్యం కాదు. ఇలా అభిమానులు సామాజిక మాధ్యమాల్లోనూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.
వీరి రగడ గురించి అటుంచితే డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన వివరాలను బట్టి చెన్నైలో రజనీకాంత్‌కే వసూళ్లరాజా పట్టం కట్టారు. అయితే తమిళనాడు వ్యాప్తంగా చూస్తే అజిత్‌నే కలెక్షన్ కింగ్‌గా నిలబెట్టారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సూపర్‌స్టార్‌దే హవా. ఆ వివరాలను ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తెలుపుతూ పేట, విశ్వాసం రెండు చిత్రాలు సక్సెస్ టాక్‌తో ప్రదర్శింపబడుతున్నాయని చెప్పారు. అయితే తమిళనాడు వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికి విశ్వాసమే వసూళ్లలో పై చెయ్యిని సాధించిందని, ఇది రూ. 26 కోట్ల కలెక్షన్లను సాధించిందన్నారు.
పేట రూ.23 కోట్ల వసూళ్లనే సాధించి విశ్వాసం కంటే రూ.3 కోట్లు తక్కువ సాధించిందని చెప్పారు. ఇక చెన్నై వరకూ చూస్తే పేటదే కలక్షన్ల హవా అని చెప్పారు. చెన్నైలోని మల్టీఫ్లెక్స్ థియేటర్లలో అధికంగా పేట చిత్రమే ప్రదర్శింపబడుతుండడం విశేషం అన్నారు. ఇక్కడ పేట చిత్రం రూ. 1.18 కోట్లు వసూల్ చేయగా విశ్వాసం రూ. 86 లక్షలనే వసూలు చేసిందని తెలిపారు. బీ అండ్ సీ థియేటర్లలో విశ్వాసం చిత్రం అధిక వసూళ్లను సాధిస్తుందదని చెప్పారు.
విదేశాల్లో పేటదే అగ్రస్థానం
ఇక ఇతర దేశాల్లో సూపర్‌స్టార్‌కు సాటి ఎవరూ రారన్నది తెలిసిందే. దాన్ని పేట చిత్రం మరోసారి రుజువు చేసింది. అక్కడ పేట చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను సాధిస్తోంది.ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజునే రూ.48 కోట్లు సాధించిదని తెలిపారు. విశ్వాసం రూ. 43 కోట్లను సాధించిందని చెప్పారు. ఒక్క అమెరికాలోనే పేట ఒక మిలియన్ డాలర్లు వసూల్ చేయగా, విశ్వాసం 83 వేల డాలర్లనే వసూలు చేసిందన్నారు. మొత్తం మీద రజనీకాంత్ పేట, అజిత్ విశ్వాసం చిత్రాలకు ప్రేక్షకులు భారీ వసూళ్లనే కట్టబెడుతున్నారు. వీటిలో ఏ చిత్రం ముందంజలో ఉంటుందన్నది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment