
సూపర్‌స్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..
చెన్నై : సూపర్ స్టార్ రజనీ కాంత్ పేరు వింటేనే సినీ ప్రియులు, అభిమానుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వెల్లువెత్తుతాయి. సినిమాల్లో తన డ్యాన్సులు, ఫైట్లతో అలరించే రజనీ ఆఫ్‌స్క్రీన్‌లోనూ అదే ఫిట్‌నెస్, చురుకుదనంతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. 68 ఏళ్ల రజనీ ఈ వయసులోనూ మెరుగైన ఫిట్‌నెస్‌ను కలిగిఉండటం వెనుక సీక్రెట్‌ను ఆయన తనతో పంచుకున్నారని వెట్రీ థియేటర్స్ అధినేత రాకేష్ గౌతమన్ చెప్పారు.
రజనీతో తాను ఇటీవల 15 నిమిషాలు ముచ్చటించానని, ఈ క్రమంలో పేట సక్సెస్‌తో పాటు సినిమాలు, ఫిట్‌నెస్ సహా పలు అంశాలపై తాము మాట్లాడుకున్నామని వెల్లడించారు. రజనీకాంత్ రోజూ యోగా చేయడంతో పాటు ఆయనకు తరచూ స్విమ్మింగ్ చేసే అలవాటు ఉందని ముఖ్యంగా సినిమా షూటింగ్ జరిగే రోజుల్లో విధిగా ఆయన స్విమ్ చేస్తానని తనతో చెప్పారని గౌతమన్ ట్వీట్ చేశారు.
నిత్యం యోగా, వ్యాయామంతో పాటు మంచి ఆహారం తీసుకుంటే యవ్వనంగా కనిపిస్తామని అన్నారని చెప్పారు. ఇక పేట వంటి పక్కా మాస్ సినిమాల్లోనే మిమ్మల్ని చూసేందుకు అభిమానులు ఇష్టపడతారని చెప్పగా రజనీ తన సహజ శైలిలో అలాగే చేద్దాం అన్నారని ఆయన చెప్పుకొచ్చారు.