'ఎవడ్రా కబాలీ.. ఎదురవ్వమను?'
చెన్నై: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ చిత్రం 'కబాలీ' టీజర్ వచ్చేసింది. ఊహించినట్లుగానే టీజర్తో మరోసారి రజనీ ఆకట్టుకున్నారు. అదిరిపోయే లుక్లో అదరగొట్టారు. ఒకప్పుడు భాషా చిత్రంలో ఎంతటి స్టైల్తో కనిపించారో.. అంతకుమించి ఆయన దర్శనమిచ్చారు.
ఈ టీజర్లో వినిపించిన కొన్ని మాటలు ఎప్పుడు ఈ చిత్రం విడుదలవుతుందా అని ఎదురుచూసేలా ఉన్నాయి. 'నువ్వేమన్నా గ్యాంగ్ స్టర్ వా' అని విలన్లు ప్రశ్నించినప్పుడు రజినీ నవ్వుతుండటం.. ఎవడ్రా కబాలీ.. దమ్ముంటే ఎదురవ్వమను అని మరోసారి విలన్ అన్నప్పుడు ఆయన చెప్పిన 'కోరమీసం, గళ్ల లుంగీ కట్టుకుని పిలవగానే వచ్చి సలాం కొట్టే నంబియార్ టైప్ కబాలీని కాదురా.. రియల్ కబాలీని' డైలాగ్ అదుర్సే అదుర్సు.. అయితే, ప్రస్తుతానికి తమిళంలో మాత్రమే ఈ టీజర్ విడుదల చేశారు.
మలేసియా బ్యాక్ డ్రాప్ లో రజనీ మాఫియా డాన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పా రంజిత్. సంగీతం సంతోష్ నారాయణ్. విడుదల తేదీని అధికారికంగా వెల్లడించాల్సిఉంది.