అవే చేస్తానంటే కుదరదు!
కథానాయికలు అంటే కేవలం పాటలు, హీరోలతో ప్రేమ సన్నివేశాలకు మాత్రమే పరిమితమా? కమర్షియల్ సినిమాల్లో వాళ్ల చోటు అంతేనా? అని రకుల్‌ప్రీత్ సింగ్‌ను అడిగితే... ‘‘లేదండీ. అమ్మాయిలకూ మంచి మంచి పాత్రలు లభిస్తున్నాయి. కానీ, అవే చేస్తానంటూ కూర్చుంటే కుదరదు. నేనైతే... నాకొచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నా. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోపక్క మంచి అవకాశాలు వచ్చినప్పుడు నటనకు ప్రాముఖ్యత గల పాత్రలు చేస్తున్నా’’ అన్నారు. ‘ధృవ’, ‘విన్నర్’ సినిమాల్లో హాట్ అండ్ మోడ్రన్ పాత్రలు చేశారీమె. ప్రస్తుతం చేస్తున్న మహేశ్‌బాబు–ఏఆర్ మురుగదాస్ సినిమాలోనూ మెడికల్ స్టూడెంట్‌గా మోడ్రన్ క్యారెక్టర్‌లో కనిపించ నున్నారు.
ఇక, నాగచైతన్య హీరోగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో మాత్రం వీటికి భిన్నంగా అమాయకపు పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తున్నానని చెప్పారు. ‘‘ఇప్పటివరకూ అమ్మాయిల (కథా నాయికలు) కోసం రాసిన అత్యుత్తమ క్యారెక్టర్స్‌లో... చైతూ (నాగచైతన్య)కి జోడీగా నేను చేస్తున్న క్యారెక్టర్ ఒకటి. హిందీ ‘జబ్ వుయ్ మెట్’తో పోల్చి చూసినా... అందులో కరీనా కపూర్ చేసిన క్యారెక్టర్ కంటే నాది మంచి పాత్ర. ఈ చిత్రంలో ఇన్నోసెంట్ విలేజ్ గాళ్‌గా కనిపిస్తా. చక్కని ప్రేమకథతో తెరకెక్కుతున్న కుటుంబ కథా చిత్రమిది. కథపై చాలా నమ్మకముంది’’ అన్నారు రకుల్.