నకిలీ బుల్లెట్‌తో ఇరకాటం
అది నకిలీ బుల్లెట్. కానీ, చుక్కలు చూపించింది. రకుల్ ప్రీత్‌సింగ్‌ని ఇరకాటంలో పడేసింది. పోలీసుల ముందు దోషిలా నిలబెట్టింది.
అది నకిలీ బుల్లెట్. కానీ, చుక్కలు చూపించింది. రకుల్ ప్రీత్‌సింగ్‌ని ఇరకాటంలో పడేసింది. పోలీసుల ముందు దోషిలా నిలబెట్టింది. ఆ బుల్లెట్ తన బ్యాగులో ఉన్నట్లు కూడా రకుల్‌కి తెలియదు పాపం. అసలు విషయానికొస్తే... ముంబయ్ వెళ్లే ఫ్లయిట్ ఎక్కడం కోసం ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లింది రకుల్. చెకిన్ అయ్యి, ఇక హాయిగా విమానంలో కూర్చోవడమే ఆలస్యం. ఈలోపు రకుల్ బ్యాగులో ఉండకూడని వస్తువేదో ఉన్నట్లు స్కానింగ్ మిషన్ కనిపెట్టేసింది. అంతే.. ‘అసలు అదెక్కణ్ణుంచి వచ్చింది? దాంతో ఏం చేయాలనుకుంటున్నావ్’ అంటూ ప్రత్యేక గదికి తీసుకెళ్లి రకుల్‌ని పోలీసులు ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టారు.
బిక్క చచ్చిపోయిన రకుల్ ఏడ్చుకుంటూ తన తండ్రికి ఫోన్ చేసి, విషయం చెప్పింది. ఆయన ఆర్మీలో పని చేశారు. ఒకవేళ ఆయన బుల్లెట్ అయ్యుంటుందేమో అనుకుంది. కానీ, ఆయనదీ కాదు. ఈలోపు బుల్లెట్‌ని పరిశీలించిన పోలీసులు అది నకిలీదని కనుగొన్నారు. అయినా వదిలిపెట్టలేదు. నకిలీదే అయినా నీకెలా వచ్చిందని రకుల్‌ని ప్రశ్నలతో విసిగించారు. ఎనిమిది నెలల క్రితం ఓ తమిళ సినిమా షూటింగ్ కోసం వాడిన బుల్లెట్ అని ఆలస్యంగా గుర్తొచ్చి, హమయ్య అని ఊపిరి పీల్చుకుంది రకుల్. విషయం పోలీసుల దగ్గర చెప్పడంతో ఆమెను వదిలిపెట్టారు. కానీ, ఆ సినిమా డీవీడీ తమకు పంపించాలని షరతు పెట్టారట.