
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ నెల 27న 35వ వడిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో ఆయన పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అభిమానులు ఇప్పటికే పలు ప్లాన్‌లు గీస్తూ, పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తుండగా, మరోవైపు తారాగణంతో మార్చి 26న గ్రాండ్ ఈవెంట్ చేసేందుకు ఆడిటోరియంను సైతం బుక్ చేసుకుని సంసిద్ధంగా ఉన్నారు. ఇంతలో రామ్‌చరణ్ తన పుట్టిన రోజు వేడుకలను విరమించుకోవాలని కోరుతూ అభిమానులకు లేఖ ద్వారా సందేశం ఇచ్చారు. ‘నా మీద ఉన్న ప్రేమ.. నా పుట్టిన రోజుని పండగగా జరిపేందుకు మీరు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోగలను. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు జనసాంద్రత తక్కువగా ఉండేట్టు చూసుకోవడం మంచిది. ఇది మనసులో పెట్టుకుని ఈ ఏడాది నా పుట్టిన రోజు వేడుకలను విరమించుకోవాల్సిందిగా మనవి. (నాది చాలా బోరింగ్ లైఫ్!: మహేశ్)
మీరంతా మన అధికారులకు సహకరించి కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టే విధానాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేసి మీవంతు సామాజిక బాధ్యతను నెరవేర్చండి. అదే నాకు మీరిచ్చే అతిపెద్ద పుట్టిన రోజు కానుక’ అని పేర్కొన్నాడు. దీంతో మొదట అభిమానులు కాస్త నిరాశ చెందినా అనంతరం అతని నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. కాగా చెర్రీ బర్త్‌డే సందర్భంగా వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర చిరంజీవి యువత జనరల్ సెక్రటరీ శివ చెర్రీ ఇన్‌ఫినిటమ్ మీడియాతో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో అభిమానులను విశేషంగా ఆకట్టుకోగా పూర్తి పాటను ఈ నెల 24న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. (రామ్ కొ.ణి.దె.ల.. స్పెషల్ సాంగ్ ప్రోమో)