
అందరి కన్నా ఎక్కువ కష్టం... చరణ్‌దే!
‘‘డిసెంబర్ 9న మా ‘ధృవ’ను రిలీజ్ చేస్తున్నాం. మధ్యలో డిసెంబర్ 2తో పాటు పలు విడుదల తేదీలు అనుకున్నాం. కానీ, ప్రజలంతా బ్యాంకులు, ఏటీయంల ముందు క్యూలు కడుతున్నారు. ఆ డేట్స్ అయితే సినిమాకి వస్తారో? రారో? అని డిసెంబర్ 9న రిలీజ్ చేయాలని నిర్ణయించాం’’ అన్నారు అల్లు అరవింద్. రామ్‌చరణ్, రకుల్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘ధృవ’ ట్రైలర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ‘‘అమెరికాలోని న్యూజెర్సీ, శాన్ ఫ్రాన్సిస్కోల్లో జరిగే ప్రీమియర్ షోలకు చిత్రబృందం హాజరవుతుంది. డిసెంబర్ 4న ప్రీ-రిలీజ్ ఫంక్షన్, ఆ తర్వాత తిరుపతి, విజయవాడ, విశాఖలలో ఫంక్షన్స్ నిర్వహిస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం అందరి కన్నా చరణ్ ఎక్కువ కష్టపడ్డాడు’’ అన్నారు సురేందర్‌రెడ్డి. ‘‘అరవింద్‌తో కలసి సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎన్వీ ప్రసాద్. ‘‘చరణ్‌తో ‘బ్రూస్ లీ’ తర్వాత, ‘కిక్’ తర్వాత సురేందర్‌రెడ్డితో, ‘సరైనోడు’ తర్వాత గీతా ఆర్ట్స్‌లో చేస్తున్న చిత్రమిది’’ అన్నారు రకుల్.