నట్టి కుమార్, రామ్ గోపాల్ వర్మ, టి. అంజయ్య
‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రాన్ని నవంబర్ 29న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ మా సినిమా కుల ద్వేషాలను రెచ్చగొడుతుందనే కారణాలు చూపి రిలీజ్‌ను అడ్డుకోవడానికి ప్రయ త్నించి, రిలీజ్ వాయిదా పడేలా చేశారు. రిలీజ్ ఆలస్యం కావడం వల్ల మాకు నష్టం జరిగింది. దీనికి కారణం అయిన వాళ్లందరి మీద నష్టపరిహారం దావా వేయబోతున్నాం’’ అన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన టైగర్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ నుంచి వచ్చిన చిత్రం ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’.
సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వం వహించిన ఈ సినిమాను అజయ్ మైసూర్, టి.నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మించారు. నట్టి క్రాంతి, నట్టి కరుణ సహ–నిర్మాతలు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో వర్మ మాట్లాడుతూ– ‘‘ఇదొక సెటైరికల్ చిత్రం. జరగబోయే దాన్ని ఊహించి తీసిన చిత్రం. చాలామందికి అర్థం కాలేదేమో. మెల్లిగ్గా అర్థం చేసుకుంటారు. బయట రాజకీయ నాయకులు ఒకరినొకరు నిజంగానే తిట్టుకుంటుంటారు. వాళ్లను పట్టించుకోకుండా సరదాగా సినిమా తీసిన మా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
బయట జరిగే వాటితో పోలిస్తే మేం చాలా తక్కువ చూపించినట్లు. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కామెడీగా తీసుకొని ప్రతికూలంగా ఉన్నప్పుడు సీరియస్‌గా తీసుకుంటే ఎట్లా? సెన్సార్ బోర్డ్, ఇంద్రసేన్ చౌదరి, ది గ్రేట్ కేఏ పాల్ మరికొందరు సృష్టించిన ఇబ్బందుల వల్ల రెండు వారాలు ఆలస్యంగా మా సినిమా విడుదలయింది. ఏ కారణాలు చెప్పి ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలనుకున్నారో, హైకోర్ట్ ఆ ఆరోపణలన్నీ కొట్టిపారేసి రిలీజ్‌కు అనుమతి ఇచ్చింది. కోర్ట్ తీర్పు ఇచ్చినప్పుడు కూడా వాళ్ల ఆరోపణలను ఆపలేదు. ‘మేం కోర్ట్‌ని మోసం చేశాం’ అని ఇంద్రసేన్ చౌదరి అనే వ్యక్తి ఆరోపించారు.
అంటే.. వాళ్లు కోర్ట్‌ని అవమానించినట్టే. ఆయనకి కోర్ట్ మీద సరైన అవగాహన లేదనుకుంటాను. రిలీజ్ ఆలస్యం వల్ల మాకు నష్టం జరిగింది. దీని వెనుక ఉన్నవాళ్ల అందరి వివరాలు సేకరిస్తున్నాం. వాళ్ల మీద నష్టపరిహారం దావా వేయాలనుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఇంద్రసేన్ చౌదరి, కేఏ పాల్, జ్యోతి ఉన్నారు. వాళ్లు నా మీద మార్ఫింగ్ కేసు కూడా పెట్టారు. మమ్మల్ని ఇబ్బంది పెడదాం అని అనుకున్నవాళ్లను వదిలే సమస్యే లేదు. త్వరలో మరిన్ని సెటైరికల్ చిత్రాలు తీస్తాను. అలానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి నేను చనిపోయినట్టు పోస్ట్‌లు పెట్టడం తప్ప వేరే కళ లేనట్టుంది. సెటైర్ స్టయిల్లోనే మరిన్ని సినిమాలు తీస్తా. నా తదుపరి చిత్రం ‘ఎంటర్ ది గాళ్ డ్రాగన్’’అన్నారు. ఈ కార్యక్రమంలో టి. అంజయ్య, నట్టి కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment