దృశ్యకావ్యం... ఆద్యంతం ఉత్కంఠభరితం
‘‘‘దృశ్యకావ్యం’లోని ప్రధాన తారాగణంతో పాటు టెక్నీషియన్స్‌కు కూడా ఎటువంటి స్టార్ వాల్యూ లేదు. కంటెంట్ మీద నమ్మకంతో తీసిన సినిమా ఇది’’ అని దర్శక-నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి అన్నారు. కార్తీక్, కశ్మీర జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి చెప్పిన విశేషాలు....
పుష్యమి ఫిలిం మేకర్స్‌పై ఇది రెండో సినిమా. ఇదే బ్యానర్‌పై శ్రీకాంత్, కామ్నా జెఠ్మలానీ జంటగా ‘వీడికి దూకుడెక్కువ’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించాం. రెండో సినిమాగా కొత్త తారాగణంతో, టెక్నీషియన్లతో ‘దృశ్యకావ్యం’ రూపొందించాను.
ఎంటర్‌టైన్ చేస్తూనే, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే చిత్రమిది. వరంగల్, హైదరాబాద్, ఇంకా పలు లొకేషన్లలో 90 రోజుల్లో పూర్తి చేశాం. ‘ఎవడి గోల వాడిదే’, ‘వాన’, ‘ప్రాణం’ చిత్రాల ఫేమ్ కమలాకర్ ఈ చిత్రానికి మంచి స్వరాలు అందించారు. ఇప్పటికే మ్యూజికల్‌గా మంచి హిట్ సాధించింది.
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని మిగిల్చే చిత్రం ఇది. మొదటి 20 నిమిషాలు పాత్రల పరిచయం తదితర దృశ్యాలతో సాగుతూ, ఆ తర్వాత ప్రతి నిమిషం ఆసక్తికరంగా సాగుతూ థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
‘దృశ్యకావ్యం’ అని టైటిల్ ఎందుకు పెట్టామో క్లయిమాక్స్‌లో తెలుస్తుంది. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ చిత్రం కనువిందుగా ఉంటుంది. హృదయానికి హత్తుకునే చిత్రం కూడా. ప్రస్తుతం నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. ఏ కథతో సినిమా చేయబోతున్నానో త్వరలో చెబుతాను. దర్శకత్వమే కాకుండా కొత్త కథలతో దర్శకులు వస్తే వాళ్లతో కూడా సినిమా నిర్మించడానికి రెడీ.