'సినీ వారసులు అతణ్ని చూసి నేర్చుకోవాలి'
దర్శకుడు రామ్గోపాల్ వర్మ యువ కథానాయకులకు చురకలంటించాడు. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ సినిమా రిలీజ్ సందర్భంగా టాలీవుడ్ స్టార్ వారసులను టార్గెట్ చేస్తూ తన మార్క్ ట్వీట్లతో చెలరేగిపోయాడు. రాజ్ తరుణ్ను చూసి మిగతా హీరోలు నేర్చుకోవలంటూ మరోసారి ఈ కుర్ర హీరోను ఇరకాటంలో పడేశాడు. గతంలో కూడా రాజ్ తరుణ్ వర్మను కామెంట్ చేసినట్టుగా తన మీద తానే ట్వీట్లు పోస్ట్ చేసుకున్నాడు వర్మ.
'తెలుగు సినిమా హద్దులు చెరిపేస్తున్న రాజ్ తరుణ్ను చూస్తే గర్వంగా ఉంది. ఇప్పటికీ పాత తరహా సినిమాలకే పరిమితమైన కుర్ర హీరోలు రాజ్ తరుణ్ను చూసి నేర్చుకోవాలి. ప్రేక్షకులను ఇడియట్స్గా భావించి సినిమాలు చేసే స్టార్ వారసులు రాజ్ తరుణ్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కుమారి 21ఎఫ్ విజయం సాధించిన సందర్భంగా రాజ్ తరుణ్, హేబా పటేల్, సూర్య ప్రతాప్లకు శుభాకాంక్షలు. వెండితెర మీద బాహుబలి లాంటి భారీ చిత్రాలు లేదా కథాబలం ఉన్న భలే భలే మొగాడివోయ్, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలు మాత్రమే విజయాలు సాధిస్తాయి.' అంటూ యువకథానాయకులకు చురకలంటించాడు.
గతంలో వర్మ పై కామెంట్ చేశాడన్న అపవాదుతోనే విమర్శలు ఎదుర్కొన్న రాజ్ తరుణ్, మరోసారి వర్మ ట్వీట్లతో ఇరకాటంలో పడ్డాడని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.