
తమిళసినిమా: నటి రెజీనా కోలీవుడ్‌లో మళ్లీ పుంజుకుంటున్నారనే చెప్పాలి. ఇంతకు ముందు తమిళం, తెలుగు అంటూ విజయాలకోసం పరుగులు తీసిన ఈ బ్యూటీకి మానగరం వంటి అనూహ్య విజయం సాధించిన చిత్రంతో ఈ అమ్మడికి ఇక్కడ ఆశాజనక పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఒక చారిత్రాత్మక కథా చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిని సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ఇతివృత్తంతో తెరకెక్కనున్న భారీ చిత్రంలో రెజీనా ఒక కీలక పాత్రను పోషించనున్నారన్నది తాజా సమాచారం.
ఇందులో సుభాష్‌చంద్రబోస్‌తో పాటు స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుడు అజాద్ హింద్ ఫౌజ్ పాత్రను నటుడు రానా పోషించనున్నారు. బాహుబలి చిత్రం తరువాత ఆయన నటించనున్న మరో చారిత్రక కథా చిత్రం ఇది. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 1945 కాల ఘట్టంలో జరిగే కథా చిత్రంగా తెరకెక్కనున్న మరో గొప్ప కళాఖండంగా ఈ చిత్రం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో రానాను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించబడ్డ యువతిగా రెజీనా నటించనున్నారట. ఇందులో ఈమె చాలా తక్కువ మేకప్‌తో విభిన్న గెటప్‌లో కనిపించనున్నారట. బాహుబలి చిత్రంతో అనుష్క, తమన్నా ఎంత పేరు సంపాదించుకున్నారో తెలిసిందే. మరి ఈ చరిత్ర కథా చిత్రం రెజీనాకు ఏ మాత్రం పేరు తీసుకొస్తుందో వేచి చూడాలి.