
ఉయ్యాలవాడలో భల్లాలదేవ..?
బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా ఆకట్టుకున్న రానాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో హల్ చల్ చేస్తోంది. భల్లాలదేవుడిగా జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చుకున్న రానా, చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నాడు. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఉయ్యాలవాడ కథతో మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో రానా నటిస్తున్నాడన్న వార్త మెగా, దగ్గుబాటి అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇప్పటికే రుద్రమదేవి, ఘాజీ లాంటి చారిత్రక కథల్లో ఆకట్టుకున్న రానా, మరోసారి అదే తరహా పాత్రకు అంగీకరించాడట. అయితే ఈ సినిమాలో రానా చేయబోయేది, పాజిటివ్ పాత్రా లేకా నెగెటివ్ అన్న విషయం తెలియాల్సి ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిర్మాత రామ్ చరణ్, రానాకు బెస్ట్ ఫ్రెండ్ కావటంతో ఈ కాంబినేషన్ తప్పకుండా తెర మీదకు వస్తుందని భావిస్తున్నారు. మరి ఈ వార్తలపై మెగా టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.