
మార్పు ఖాయం!
రానా, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో సురేశ్‌బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘నేనే రాజు నేనే మంత్రి’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. టైటిల్ అదేనంటూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘తేజగారు కథ చెప్పినప్పుడే రానా కెరీర్‌లో ఓ వైవిధ్యమైన చిత్రం అవుతుందనిపించింది.
రానాలోని నటుడు మరో కొత్త కోణంలో కనిపించడానికి ఆస్కారం ఉంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనం పట్టించుకోం. పోతే పోనీ అనుకొంటూ దశాబ్దాలుగా బతికేస్తున్నాం. ఈ దృక్పథాన్ని మార్చే చిత్రమే ‘నేనే రాజు నేనే మంత్రి’. రానా పాత్ర సమాజంలో మార్పు తీసుకొస్తుంది’’ అన్నారు తేజ. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అభిరామ్ దగ్గుబాటి, వివేక్ కూచిభొట్ల, సమర్పణ: డి. రామానాయుడు.