
రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్
బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న యంగ్ యాక్టర్స్‌లో ముందు వరుసలో ఉండే నటులు రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్. విభిన్న కథలు, అద్భుతమైన నటనతో పోటాపోటీగా కనిపిస్తుంటారు. ఇప్పుడు ఈ ఇద్దరూ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు అని బాలీవుడ్ టాక్. వీళ్లిద్దరూ కలసి 1994 బ్లాక్‌బస్టర్ మూవీ ‘అందాజ్ అప్నా అప్నా’ సీక్వెల్‌లో నటించబోతున్నారన్నది వార్త. ‘అందాజ్ అప్నా అప్నా’ చిత్రంలో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలసి నటించారు. రాజ్‌కుమార్ సంతోషీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించే పనిలో పడ్డారు దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషీ. ఈ సీక్వెల్ కోసం ఈ వీర్... బీర్.... అదేనండీ.. రణ్‌వీర్, రణ్‌బీర్‌తో చర్చలు జరుపుతున్నారట. వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లొచ్చు.