మాటిస్తే నిలబెట్టుకుంటా | Rashmika Mandanna Interview About Bheeshma Movie | Sakshi
Sakshi News home page

మాటిస్తే నిలబెట్టుకుంటా

Published Mon, Feb 17 2020 12:16 AM | Last Updated on Mon, Feb 17 2020 12:16 AM

Rashmika Mandanna Interview About Bheeshma Movie - Sakshi

రష్మికా మందన్నా

‘‘కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు, నా మనసుకి నచ్చిన పాత్రలు, ఈ పాత్ర నేను చేస్తే కొత్తగా ఉంటుంది అనే సినిమాలనే ప్రస్తుతం ఎంపిక చేసుకుంటున్నాను. సినిమా చూడటానికి థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుడు ఒక కొత్త అనుభూతికి లోనవ్వాలి. లేదా కడుపుబ్బా నవ్వుకోవాలి. ‘భీష్మ’ సినిమా చూసి థియేటర్‌ నుంచి బయటకు వచ్చేవాళ్లందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు’’ అన్నారు రష్మికా మందన్నా. ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రష్మిక చెప్పిన విశేషాలు.

► ‘భీష్మ’లో చైత్ర అనే పాత్ర చేశాను. భీష్మ ఆర్గానిక్స్‌ కంపెనీలో పని చేస్తుంటాను. ఈ సినిమాలో బాగా డ్యాన్స్‌ చేశాను. వినోదం పంచాను. ఇది చాలా సరదా సినిమా అయినప్పటికీ ఇందులో రైతుల సమస్యలను, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ విషయాలను చర్చించాం. ఈ విషయాన్ని వెంకీ చాలా సున్నితంగా డీల్‌ చేశారు. ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పే సమయంలో బాగా ఎంజాయ్‌ చేశాను.

► ‘ఛలో’ తర్వాత వెంకీ కుడుముల నెక్ట్స్‌ సినిమాలో నటిస్తాను అని అప్పుడే చెప్పాను. మాటిస్తే నిలబెట్టుకోవాలనుకునే మనస్తత్వం నాది. కొన్నిసార్లు డేట్స్‌ ఇబ్బంది అయినా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. వరుసగా సినిమాలు చేయడం వల్ల కొన్ని సినిమాలు వదులుకోవాల్సి ఉంటుంది. అలా ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటించే అవకాశం మిస్‌ అయింది. నాతో సినిమాలు చేసిన దర్శకులు మళ్లీ నన్ను హీరోయిన్‌గా పెట్టుకోవాలనుకోవడం చాలా సంతోషంగా ఉంది.

► ‘అఆ’ సినిమాలో నితిన్, సమంత జంట నాకు చాలా ఇష్టం. నితిన్‌తో పని చేసేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ తను చాలా కూల్‌గా కాలేజ్‌కి వెళ్లే అబ్బాయిలా ఉన్నారు. తనతో కలసి పని చేయడం చాలా సౌకర్యవంతంగా అనిపించింది.

► ఈ సినిమా టైటిల్‌లో బ్యాచ్‌లర్‌ ఉన్నా సినిమా రిలీజ్‌ అవ్వకముందే నితిన్‌ ఎంగేజ్‌ అయిపోయారు. నిశ్చితార్థానికి రెండు రోజుల ముందే నితిన్‌ లవ్‌స్టోరీ గురించి తెలిసింది. అప్పటివరకూ మాకు ఎవ్వరికీ చెప్పలేదు. నేను కన్నడంలో ‘పొగరు’ సినిమా చేస్తున్న సమయంలో «ధృవ సర్జాగారికి పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నితిన్‌గారికి కూడా పెళ్లి అవుతోంది (నవ్వుతూ).

► నా ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అంటే.. జిమ్‌ చేస్తుంటాను. వెయిట్‌ లిఫ్టింగ్స్‌ చేస్తుంటా. స్పోర్ట్స్‌ ఆడతాను. డైట్‌ మెయింటేన్‌ చేస్తుంటాను. షుగర్‌ ఉన్న పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేశాను. చాక్లెట్స్‌ వైపే చూడటం లేదు.

► పబ్లిక్‌లో కనిపించేవాళ్లు విమర్శలు ఎదుర్కోవడం  కామన్‌. మన గురించి ఎప్పుడూ  మంచే మాట్లాడాలని అనుకోలేం. అది కుదరదు కూడా. నా కెరీర్‌ తొలి రోజుల్లో చాలా సీరియస్‌గా తీసుకునేదాన్ని. ఇప్పుడు విమర్శలను పట్టించుకోవడం లేదు.

► ప్రస్తుతం అల్లు అర్జున్‌ – సుకుమార్‌ సార్‌ కాంబినేషన్‌ సినిమాలో నటిస్తున్నాను. ఆ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.

► మా నాన్నగారు బిజినెస్‌మేన్‌. నేను నటిని. దాంతో కాజ్యువల్‌గా ఐటీ రైడ్స్‌ చేశారు. మా ఇంట్లో ఏమీ దొరకలేదు. వెళ్లిపోయారు.

► కుక్క బిస్కెట్లు తింటోందని నా గురించి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌æ చేస్తున్నారు. ఓ రోజు సరదాగా ట్రై చేద్దాం అని చిన్న ముక్క కొరికాను అంతే (నవ్వుతూ). దానికి నితిన్‌ ‘నేను కుక్క బిస్కెట్లు తింటాను’ అని చెప్పారు.

► వేలంటైన్స్‌ డే రోజు ఫుల్‌ బిజీ షెడ్యూల్‌. కానీ  అనుకోకుండా అన్నీ క్యాన్సిల్‌ అయ్యాయి. ఉదయ్యానే జిమ్‌ చేసి, మంచి ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ సినిమా చూడాలనుకున్నాను. సగంలోనే నిద్రపోయా. ఆ తర్వాత ఓ కథ న్యారేట్‌ చేయడానికి ఓ డైరెక్టర్‌ వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement