మళ్లీ వాయిదా పడిన 'రుద్రమదేవి' ..?
గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రుద్రమదేవి మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. తొలి ఇండియన్ స్టీరియో స్కోపిక్ త్రీడి చిత్రంగా భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆర్ధిక సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల ఇప్పటికే ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 9న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, ఆ రోజు కూడా రుద్రమదేవి ప్రేక్షకుల మందుకు వచ్చే అవకాశాలు కనిపించటం లేదు.
ఇంకా ఆర్థిక సమస్యల నుంచి తేరుకోకపోవటంతో, పాటు గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తి కాకపోవటంతో సినిమా రిలీజ్ ను మరోసారి వాయిదా వేయాలని భావిస్తున్నారట. చారిత్రక కథాంశం కావటంతో సినిమాలో చాలా భాగం గ్రాఫిక్స్ మీదే ఆధారపడి ఉంది. దీనికి తోడు తొలి స్టీరియెస్కోపిక్ త్రీడి చిత్రం కావటం, ఆ టెక్నాలజీ మన దగ్గర పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవటం లాంటి సమస్యల కారణంగా సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అక్టోబర్ 9న రిలీజ్ కష్టమే అని తేలిపోవటంతో మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు.
రుద్రమదేవి పాత్రలో అనుష్క, రానా, అల్లు అర్జున్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, బాబాసెహగల్ లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇళయరాజ సంగీతం అందిస్తుండగా, గుణటీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు.