రోమ్‌లో మొదలైంది....
ప్రేమ అనేది ఎప్పుడు? ఎలా? ఎవరిపై కలుగుతుందో తెలియదు. నటి అమలాపాల్, దర్శకుడు విజయ్‌ల ప్రేమ వ్యవహారం గురించి కొంత కాలంగా బోల్డంత ప్రచారం జరుగుతోంది. వీరి ప్రేమ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. అయితే వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ పడిందెక్కడో తెలుసా? రోమ్ నగరంలో విజయ్, అమలాపాల్ మధ్య ప్రేమ మొలకెత్తింది. అయితే తన ప్రేమ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి నటి అమలాపాల్ చాలా మదనపడ్డారట. మరి వీరి ప్రేమ రహస్యాలేమిటి? ఈ జంట మనసు విప్పారిలా.
విజయ్: మైనా చిత్రంలో లంగా ఓణీ ధరించి, తలనిండా నూనె రాసుకున్న అమలాపాల్‌ను చూడగానే నాకు బాగా నచ్చేసింది.
అమలాపాల్ : విజయ్ మదరాసుట్టణం చిత్రం నాకు బాగా నచ్చింది. అప్పుడే తొలిసారిగా ఆయనతో మాట్లాడాను. ఆ తరువాత విజయ్ దర్శకత్వంలో దైవతిరుమగళ్ చిత్రంలో నటిం చాను. ఆ సమయంలో మా మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మా స్నేహం చూసి నటుడు విక్రమ్ మీ మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది. మీరు వివాహం చేసుకుంటారని అప్పుడే చెప్పారు. ఆ తరువాత తలైవా చిత్రంలో మళ్లీ కలిసి పని చేశాం. ఆ చిత్రం షూటింగ్ సిడ్నీలో నెల రోజులకు పైగా జరిగింది. ప్రతి రోజు వేకువ జామున ఇద్దరం జాగింగ్‌కు వెళ్లేవాళ్లం. అప్పుడు మమ్మల్ని చూసిన నృత్య దర్శకురాలు బృందాకు మేము ప్రేమలో పడ్డామనే సందేహం కలిగింది. తలైవా చిత్రంలో తాడు పట్టుకుని డ్యాన్స్ చేసే సన్నివేశం చోటు చేసుకుంది. ఆ సన్నివేశంలో నటిస్తుండగా అనూహ్యంగా కిందపడిపోయాను. అప్పుడు నాకంటే ఎక్కువ బాధపడింది విజయ్‌నే. అప్పుడు సెట్‌లో ఉన్నవారందరికీ మా ప్రేమ గురించి తెలిసిపోయింది.
విజయ్: స్నేహం ప్రేమగా మారడం మంచి పరిణామం. స్నేహం ఉన్న చోట కల్మషం ఉండదు. అలాంటప్పుడే ఇద్దరిలోని ప్లస్‌లు, మైనస్‌లూ తెలుస్తాయి.
అమలాపాల్: మా ప్రేమ పెళ్లితో ముగుస్తుందని మాకు తెలుసు. అయినా నేను మరో మూడేళ్లు నటించాలని భావించాను. విజయ్ కూడా నువ్వు మంచి నటివి. మరో మూడే ళ్లు నటించమని చెప్పారు. అయితే ఆయన ఇంటిలో పెళ్లిపై ఒత్తిడి పెరిగింది. విజయ్ ఇంకా వేచి ఉండలేని పరిస్థితి. దీంతో నాకు కాస్త సంకట పరిస్థితి. ప్రస్తుతం రెండు మలయాళ చిత్రాలు చేస్తున్నాను వివాహానంతరం ఈ చిత్రాలు పూర్తి చేసి ఆపై నటనకు స్వస్తి చెబుతాను.
విజయ్: ఒక మంచి నటి, ఇంత చిన్న వయసులోనే నటనకు దూరం అవడం సరైనదేనా? అని అమలాపాల్‌ను అడిగాను. అందుకామె నాకు సినిమా కంటే జీవితమే ముఖ్యం అన్నారు. తమ మాటలు నా మనసును తాకారుు.
అమలాపాల్: నేను జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయం విజయ్‌తో వివాహమే. విజయ్‌ను కలుసుకునే వరకు నాకు పెళ్లి ఆలోచనే లేదు. భగవంతుడు నాకు చిన్నతనం నుంచే మంచి అవకాశాలను అందించారు. అందులో వివాహం ఒకటి. దీన్ని నేను చక్కగా సద్వినియోగం చేసుకుంటాను. ఇంతకీ మా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ పడిందెక్కడో తెలుసా? రోమ్ నగరంలో. అదెలాగంటే విజయ్‌తో ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా అన్న ఒక రకమైన భయంతోనే కుటుంబ సభ్యులతో కలిసి పారిస్ వెళ్లాను. అక్కడ నుంచి అమ్మ నాన్నలతో రోమ్‌కు వెళ్లాం. అక్కడ ఊహించని విధంగా దేవాలయం ముందు విజయ్ ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆయన తన ప్రేమకు పచ్చజెండా ఊపారు.