
అతను ‘ఓకే’ అంటే నేను పెళ్లికి రెడీ!
ఆనందం వచ్చినా, బాధ అనిపించినా తట్టుకోలేని తత్వం సమంతది. పలు సందర్భాల్లో ఆమెను ఇబ్బందులకు గురిచేసింది కూడా ఈ తత్వమే. కానీ... సమంత మాత్రం తన ప్రవర్తనను మార్చుకోరు. ముక్కుసూటిగా వెళ్లిపోతుంటారు. ఇటీవల ఆమె తొందరపాటు తనం మరోమారు ఆమెను ఇబ్బందుల పాలు చేసింది. అది కూడా వేలాది మంది జనాల సమక్షంలో. వివరాల్లోకెళ్తే - కోలీవుడ్‌లో విజయ్ సరసన ‘కత్తి’ సినిమాలో సమంత కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవల చెన్నయ్‌లో జరిగింది. చిత్రం యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి విజయ్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ సినిమాలో కామెడీ రోల్ చేసిన సతీశ్ అనే నటుడు మాట్లాడుతూ ‘‘పెళ్లంటూ చేసుకుంటే సమంత లాంటి అమ్మాయిని చేసుకోవాలనేది నా డ్రీమ్’ అన్నాడు. మరి సతీశ్ మాటలకు పొంగిపోయిందో ఏమో కానీ, సమంత మైక్ తీసుకొని ‘‘సతీశ్ ‘ఓకే’ అంటే... తనను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ’’ అనేసిందట. అంతే... ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా పిన్‌డ్రాప్ సెలైన్స్. వెంటనే నాలుక కరుచుకున్న సమంత... ‘‘నేను సరదాగా అన్నానంతే’’ అని కవర్ చేసేసిందట. అయితే సమంత అలా అనడం కోలీవుడ్‌లో పెద్ద చర్చకే దారితీసిందని విశ్వసనీయ సమాచారం.