ప్రముఖ పాప్ సింగర్, ఒకప్పటి గ్లామర్ గర్ల్ సమంతా ఫాక్స్ తన ఆత్మకథలో సంచలన విషయాలు వెల్లడించారు. ‘ఫరెవర్’ పేరిట వెలువరించిన తన జీవితకథలో లైంగిక దాడి, మోసం, జాతీయ క్షమాపణ వంటి విషయాలను వెల్లడించారు.
కొలంబియాలో డ్రగ్స్ మాఫియా అధినేత పార్టీలో పాటలు పాడేందుకు గతంలో తనకు 50వేల డాలర్లు ఇచ్చారని ఆమె వెల్లడించారు. దక్షిణ అమెరికాలో పాప్ కచేరిలో నిర్వహిస్తున్నప్పుడు ఓ వ్యక్తి తన మేనేజర్ వద్దకు వచ్చి తన కూతురు 21వ పుట్టినరోజు వేడుకల్లో పాటలు పాడాలని నేరుగా 50వేల డాలర్లు ఇచ్చాడని ఆమె తెలిపారు. అతను చాలా ధనికుడై ఉంటాడని, అందుకే తన కూతురి పుట్టినరోజు వేడుకలకు తనను పిలిచాడని అప్పట్లో భావించానని ఆమె పేర్కొన్నారు. అయితే, చుట్టూ మెషిన్ గన్లతో సాయుధులు కాపలా ఉన్న పెద్ద బంగ్లాలోకి తనను తీసుకున్నారని, అక్కడ జరిగిన పార్టీలో తాను పాటలు పాడానని తెలిపారు. అప్పటి బుష్ ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాపై యుద్ధం ప్రకటించిందని, అలాంటి సమయంలో డ్రగ్స్ మాఫియా అధినేత ఇంట్లో తాను పాటలు పాడినట్టు ఆమె వెల్లడించారు.
ఆ తర్వాత కొన్నాళ్లకు తన మేనేజర్ డేట్స్ ఇవ్వడంలో గందరగోళానికి గురయ్యాడని, దీంతో సంగీత కచేరికి ఒక రోజు ఆలస్యంగా వెళ్లామని గుర్తుచేసుకున్నారు. ఈ సమయంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని, అంతేకాకుండా లక్ష డాలర్లు పరిహారంగా చెల్లించేవరకు నిర్వాహకులు తమను బందీగా పెట్టుకున్నారని ఆమె తెలిపారు. అప్పుడు తన వెంట ఉన్న తండ్రి డబ్బు మొత్తం తీసుకొని ఇంగ్లండ్ వెళ్లిపోయాడని, దీంతో ఉచితంగా ఓ సంగీత కచేరి నిర్వహించి.. ఎలాగోలా డబ్బులు సేకరించి పాస్ పోర్టులు విడిచిపించుకొని.. పనామాకు తిరిగొచ్చామని తెలిపింది.
ప్రముఖ పాప్ స్టార్ డేవిడ్ క్యాసిడైతో అర్ధనగ్న ఫొటోషూట్ సందర్భంగా అతను లైంగిక ఉద్దీపనకు గురయ్యాడని, ఆ తర్వాత డిన్నర్ సందర్భంగా రెస్టారెంట్లోని టాయ్ లెట్ లో తనపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడని, కానీ తాను తీవ్రంగా ప్రతిఘటించి.. అతన్ని తోసేశానని ఆమె పేర్కొన్నారు.
అలాగే ఢిల్లీలో పాప్ కచేరి అనుభవాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ సంగీత కచేరి సందర్భంగా పురుషులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు చొక్కాలు విప్పి డ్యాన్స్ చేశారని, ఇది తనకు చిత్రంగా, కొంచెం ఎబ్బెట్టుగా తోచిందని ఆమె రాసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment