నాకు అసలే ‘ముక్కు’ మీద కోపం!
‘‘మరోసారి నా ముక్కుమీద కామెంట్లు చేశారో జాగ్రత్త. నాకసలే ముక్కు మీదే ఉంటుంది కోపం’’ అంటూ చెన్నయ్‌లోని ఓ కార్యక్రమంలో అక్కడి మీడియా వారిపై సమంత అంతెత్తున లేచారు. ఇంతకీ సమంతకు అంత కోపం ఎందుకొచ్చిందా అనుకుంటున్నారా? వివరాల్లోకెళ్తే - ఎప్పుడూ ఏదో ఒక వ్యాధితో సమంత బాధ పడుతోందని మీడియాలో వార్తలు రావడం పరిపాటైపోయింది. అంతకు ముందు ఆమె చర్మవ్యాధితో బాధపడుతోందని మీడియాలో పలు కథనాలొచ్చాయి.
అది మరువకముందే... సమంత ముక్కుకు గాయమైందనీ, దాంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని మరికొన్ని కథనాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఇప్పుడు కొత్తగా మరో వార్త ఆమెపై హల్‌చల్ చేయడం మొదలైంది. అదే... ‘ముక్కుకు సర్జరీ’. గతంలో జరిగిన ప్రమాదం వల్ల ఆమె ముక్కుకు ఓ సారి సర్జరీ జరిగిందనీ, అందుకే ముక్కు ఆకారంలో మార్పు వచ్చిందనీ, మళ్లీ పూర్వాకారంలోకి ముక్కును తీసుకురావడానికి మరో సర్జరీ అవసరం అనీ, అందుకే ప్లాస్టిక్ సర్జరీ నిమిత్తం సమంత లండన్ వెళ్తున్నారనీ మరో కథనం చెన్నయ్ మీడియాలో షికారు చేస్తోంది.
ఇది ఇలా ఉంటే... చెన్నయ్‌లోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సమంతతో అక్కడి మీడియా ఈ విషయంపై ప్రశ్నల వర్షం కురిపించింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ ‘‘నా ముక్కు బ్రహ్మాండంగా ఉంది. పైగా నాది అందమైన ముక్కు. దానిపై కత్తి పెట్టించుకోవాల్సిన అవసరం ఏంటి నాకు? ఇలాంటి వార్తల్ని ఇప్పటికైనా ఆపితే మంచిది. నాకసలే ముక్కుమీదే ఉంటుంది కోపం’’ అంటూ చిరుబుర్రులాడారు.