
అందరూ కరీనా కపూర్‌లా అందంగా ఉండలేరు కదా అంటూ తనను కామెంట్ చేస్తున్న నెటిజన్లపై మండిపడుతున్నారు హీరోయిన్ సమీరా రెడ్డి. తెలుగులో ‘నరసింహుడు’, ‘జై చిరంజీవ’, ‘అశోక్’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సమీరా 2014లో అక్షయ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరికి ఒక కుమారుడు.. త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు సమీరా.
ఈ సందర్భంగా తన మొదటి కుమారుడితో కలిసి దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే.. సమీర మునుపటిలా లేరని, చాలా లావైపోయి అందవిహీనంగా కనిపిస్తున్నారంటూ చెత్త కామెంట్లు చేస్తున్నారు ట్రోలర్స్. దాంతో ‘మీకు జన్మనిచ్చిన తర్వాత కూడా మీ అమ్మ హాట్‌గానే ఉందా’ అంటూ దిమ్మతిరిగే సమాధానం చెప్పి కామెంట్లు చేసేవారి నోరు మూయించారు సమీరా.
ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘కరీనా కపూర్ లాంటి వారు వివాహమై, పిల్లల్ని కన్న తర్వాత కూడా చాలా అందంగా మెరిసిపోతుంటారు. నాలాంటి వారు మాత్రం సన్నబడటానికి కాస్త సమయం తీసుకుంటారు. అందరూ కరీనాలా ఉండాలనిలేదు కదా..? ఆడవాళ్లను బాడీషేమింగ్ (శరీరాకృతి గురించి కామెంట్లు చేయడం) చేయడం సిగ్గుచేటు. నన్ను ట్రోల్ చేస్తున్నవారిని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు పుట్టిన తర్వాత కూడా మీ అమ్మ హాట్‌గానే ఉందా? ఇలాంటి కామెంట్లు చేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి’ అంటూ ఘాటుగా స్పందించారు సమీరా.
అంతేకాక ‘ప్రెగ్నెన్సీ అనేది చాలా సహజమైన ప్రక్రియ. ప్రతి ఆడపిల్ల జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తల్లికాక తప్పదు. అమ్మ అని పిలిపించుకోవడం ఎంతో అందమైన అనుభూతి. నాకు కొడుకు పుట్టాక బరువు తగ్గడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు నేను మళ్లీ తల్లిని కాబోతున్నాను. కాబట్టి లావు తగ్గడానికి మరింత సమయం పట్టొచ్చు. కానీ మన శరీరం ఎలా ఉన్నా దానిని స్వీకరించడం ఎంతో అవసరం. నన్ను కామెంట్ చేస్తున్నవారందరికి ఒకటే చెప్తున్నాను.. మీరు కేవలం నాన్‌సెన్స్ మాత్రమే చేయగలరు కానీ నాకు చాలా శక్తి ఉంది. నేను ఓ బిడ్డకు జన్మనివ్వగలను’ అంటూ కామెంట్లు చేసేవారికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు సమీరా.
Comments
Please login to add a commentAdd a comment