
దేవవాసు సినిమాలో ‘అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా’ అంటూ విషాదగీతాన్ని ఆలపించి తెలుగు ప్రేక్షకులతో కంటతడి పెట్టించిన సీనియర్ గాయని కె రాణి (75) కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రాణి.. హైదరాబాద్, కళ్యాణ్ నగర్‌లోని తన కుమార్తె విజయ నివాసంలో శుక్రవారం రాత్రి తొమ్మది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.
శ్రీలంక జాతీయగీతాన్ని ఆలపించి అరుదైన ఘనత సాధించిన్న రాణి తొమ్మిదేళ్ల వయసులోనే సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలుగులో దాదాపు 500లకు పైగా పాటలను ఆలపించారు. తమిళం, కన్నడం, మలయాళం, హిందీ,బెంగాలీ, సిన్హలా, ఉజ్జెక్ తదితర భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. రూపవతి సినిమాతో తెలుగులో తన కెరీర్‌ను మొదలు పెట్టిన రాణి.. బాటసారి, జయసింహ, ధర్మదేవత, లవకుశ తదితర సూపర్‌హిట్ చిత్రాల్లో పాటలు పాడారు.
జాతీయ కాంగ్రెస్ నాయకుడు కామరాజ్ ఆమెను ‘ఇన్నిసాయ్ రాణి’ అంటూ కీర్తించారు.1951లో గాలివీటి సీతారామిరెడ్డిని వివాహం చేసుకున్న తరువాత సినీ సంగీతానికి దూరమయ్యారు. సర్వేపల్లి రాధకృష్ణగారు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శన ఇచ్చిన ఘనత కూడా కె.రాణి సొంతం. ఆమె మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.