
మా స్నేహానికిఢోకా లేదు!
కొన్నేళ్ల వరకూ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేది. కానీ కాలం మారింది. వారిద్దరి మధ్య ఉన్న వైరం కాస్త స్నేహంగా గుబాళించింది. కానీ గాసిప్ రాయుళ్లు మాత్రం వీరిద్దరినీ ఏ మాత్రం వదలట్లేదు . ఏదొక విషయంలో వీరిద్దరినీ వార్తల్లోకి లాగుతున్నారు. అసలు విషయం ఏంటంటే...సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం ‘సుల్తాన్’ ను వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే షారుక్ ఖాన్ ఇప్పుడు నటిస్తున్న ‘రాయీస్’ కూడా ఇదే రోజున విడుదల కానుంది. దీని గురించి మీడియాలో పలు వార్తా కథనాలు వచ్చాయి. ‘సుల్తాన్ వెర్సస్ రాయీస్’ అని, ఇద్దరూ ఒకే రోజున ఢీకొంటున్నారని ప్రచారం చేసింది మీడియా.
ఈ కథనాలతో విసిగిపోయిన షారుక్ ఇక లాభం లేదనుకుని తనదైన శైలిలో వీటికి సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ-‘‘ ఏడాదికి 365 రోజలుంటాయి. ఆ రోజుల్లో ఎవరైనా ఎప్పుడైనా తమ సినిమాలు విడుదల చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్లది. ఒక్కో సారి రెండు సినిమాలు ఒకే రోజు అంటే శుక్రవారం వస్తాయి. దాంట్లో నష్టం ఏముంది? ‘రాయీస్’, ‘సుల్తాన్’ ఒకే రోజు అంటే 2016 రంజాన్‌కు విడుదల అవుతున్నాయని, మా రెండు సినిమాలకు క్లాష్ వస్తుందని కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎవరి బిజినెస్ వాళ్లది.ఒక వేళ మా రిలీజ్ డేట్లు ఒకటైనా మా ఇద్దరి మధ్య స్నేహానికి ఎటువంటి ఢోకా ఉండదు’’ అని చెప్పుకొచ్చారాయన.