ఒక్క ఛాన్స్ కోసం..
పెదగంట్యాడ (గాజువాక) :
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. నరులెవరు నడవనది ఆరూట్లో నే నడిచెదరో.. పొగరని అందరు అన్నా.. అది మాత్రం నా వైజం! తెలువని కొందరు అన్నా.. అది నాలో మేనరిజం!
నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు.. నేను ఒక్కడిని ఒక వైపు లోకం ఒక వైపు..!!
'నువ్వు నిలబడి నీళ్ళు తాగడం నథింగ్ స్పెషల్ పరుగులెత్తుతు పాలు తాగడం సమ్‌థింక్ స్పెషల్' అంటున్నారు ఈ తరం అబ్బాయిలు. అందుకే ట్రెండ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఒక్క ఛాన్స్ కోసం సంవత్సరాల కొద్దీ కష్టపడుతున్నారు.
నగరంలో ఇటువంటి టేలెంటెడ్ గైయ్స్‌పై ఈ కథనం..
కోత్తగా ట్రై చేస్తున్న యూత్
అవును... ఇది నిజం సినిమా డైలాగ్ కాదు నాకు ఇగో వైఫైలాగా చుట్టూ ఉంటది అని చెప్పుకోవడానికి బాగున్నా ప్రతి మనిషిలో ఈగో ఫీలింగ్ అంతో ఇంతో ఉంటుంది. ఇది ప్రస్తుతం యువతపై చాలా ప్రభావం చూపుతోంది. డ్రెస్సింగ్ దగ్గర్నుంచి అందరూ తమదైన కొత్త స్టైల్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. గతంలో అయితే సినిమా హీరోల గెటప్‌లను ఫాలో అయ్యేవారు. ప్రస్తుతం ఆ ట్రెండ్ పోయింది. యువత కొత్త బాట పట్టింది. వారి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా కొత్త మేనరిజమ్స్ స్టైల్‌తో పాటు కెరియర్‌ను కూడా ఎవరికి వారే క్రియేట్ చేసుకుంటున్నారు. పదేళ్ల క్రితం పోకిరీ సినిమాలో మహేశ్‌బాబు ముక్కును వేలుతో రుద్దితే అది స్టైల్‌గా ఫిక్సైంది. అంతకు ముందు అలా అంటే జలుబు చేసిందా అని అడిగేవారు. అలాగే ఇప్పుడు యువత కొత్త కొత్త క్రియేషన్స్ నాంది పలుకుతున్నారు.
స్టైల్ ఐకాన్‌లుగా...
పెరిగిన ఫొటోగ్రఫీ కారణంగా ప్రతి వ్యక్తి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాలని, తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకుంటే సమాజంలో తనని కొత్తగా గుర్తిస్తారనే తపన యువతలో పెరిగింది. అందుకే ఇప్పుడు అందరూ స్టైలిష్ ఐకాన్లుగా మారుతున్నారు. ఎక్కడో చూసి కాపీ కొట్టినట్టుగా కాకుండా తమకంటూ ఒక స్టైల్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఉదాహరణకు సందీప్ అనే కుర్రాడికి సినిమాలో హీరోగా నటించాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది. అందుకోసం చాలా కష్టపడి తన హెయిర్ స్టైల్ దగ్గర్నుంచి బాడీ లాంగ్వేజ్ వరకూ అన్ని మార్చుకున్నాడు. ఇక రియల్ లైఫ్‌లో కూడా ఇలాగే తన స్టైల్‌ను కొనసాగిస్తున్నాడు. అలాగే షణ్ముక్ అనే మరో డాన్సర్‌కు యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలని చాలా తహతహలాడుతున్నాడు. అందుకే చాలా షార్ట్ ఫిల్మ్‌లలో నటించాడు. కాని అందరిలాగే తనను కూడా చూస్తున్నారని భావించాడు. దీంతో తనలోని డ్యాన్స్ టాలెంట్‌కు పని చెప్పాడు. లేటెస్ట్‌గా రిలీజైన సూపర్ హిట్ పాటలకు తనే డాన్స్ చేసి వీడియో తయారు చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అతడి వీడియోలకు ఆదరణ బాగా పెరిగింది. వైజాగ్‌లో మేల్ మోడల్స్ చాలా తక్కువ నిజం చెప్పాలంటే వేళ్లమీద లెక్కపెట్టేంత మంది మాత్రమే ఉన్నారు.
ప్రేమ్, కార్తిక్‌లు ఎన్ని కష్టాలు ఎదురైనా తను అనుకున్న ప్రొఫెషన్‌లో కొనసాగడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. అలాగే భార్గవ్ అనే యువకుడు కాక్ టెయిల్ అనే హిప్ హాప్ మ్యూజిక్ ట్రూప్‌ను ఏర్పాటు చేసి తెలుగులో హిప్ హాప్ సాంగ్స్ చెయ్యడానిక ప్రయత్నిస్తున్నారు. ఎంవీపీలో బి ఫర్ బిర్యానీ పేరుతో బిర్యానీకీ బ్రాండ్ క్రియేట్ చేసి రాష్ట్రమంతటా బ్రాంచ్‌లు క్రియేట్ చెయ్యడానిక కొంత ముంది యువకులు ప్రయత్నిస్తున్నారు. వేర్వేరు రంగాల్లో ప్రస్తుతం ఇలాంటి యువకులు కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చేస్తున్న పని ఏదైనా దీన్ని గౌరవించి పది మందికి నచ్చుతుందనే నమ్మకంతో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులంతా ఎప్పుడో ఒకప్పుడు లైమ్ లైట్‌లోకి వస్తారు. దాని కోసం ఇప్పటికే సంవత్సరాల తరబడి కష్టపడుతున్నారు. కాని ఒక్కసారి ఛాన్స్ ఇస్తే తమను తాము నిరూపించుకోవడానికి ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తామని అంటున్నారు. అందుకే స్టైల్ ఐకాన్‌లుగా నిలబడటానికి యువత పడుతున్న తపన చాలా మందికి ఆదర్శం కావాలని కోరుకుందాం. వాళ్లంతా వైజాగ్ పేరును నిలబెట్టడాని ఏదో ఒకరోజు పైకొస్తారని ఆశిద్దాం.