![Shilpa Shinde Reaction On Trolls Over Her Support To Navjot Singh Sidhu - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/25/sidhu.jpg.webp?itok=Zk4ewTxZ)
‘పాజీ మాట్లాడిన దానిలో తప్పేం ఉంది. మీరు అనవసరంగా ఆయన మాటలను వక్రీకరుస్తున్నారు’ అంటూ బిగ్‌బాస్ 11(హిందీ) ఫేం, కాంగ్రెస్ నేత శిల్పా షిండే... తమ పార్టీ నాయకుడు, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధుకు అండగా నిలిచారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. ‘ఉగ్రవాదానికి జాతి, మతం ఉండదు.. ఎవరో చేసిన తప్పునకు దేశాన్ని నిందించడం సరికాదు’ అని సిద్ధు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా సిద్ధు తీరుపై నెటిజన్లు మండిపడ్డారు.(పుల్వామా ఉగ్రదాడి : సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు)
ఈ విషయంపై స్పందించిన శిల్పా షిండే మాట్లాడుతూ... ‘ చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నా. నన్ను ట్రోల్ చేసిన వాళ్లకు బుద్ధి చెప్తా. పుల్వామా దాడిపై స్పందించిన మహిళా జర్నలిస్టులకు కూడా బెదిరింపులు వచ్చాయి. పాజీ(సిద్ధు)కి మద్దతుగా మాట్లాడినందుకు నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు. నిజానికి ఇటువంటి వ్యక్తులు కూడా ఉగ్రవాదులే. లష్కర్, జైషే ఉగ్రవాదుల కంటే వీరు చాలా ప్రమాదకరం. అసలు పాజీ అన్నదాంట్లో తప్పేం ఉంది. ఆయన ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వలేదు. శాంతియుత చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించకుండా ఓ రాజకీయ నాయకుడిగా ఆయన తప్పు చేశారనుకుంటున్నారేమో. కానీ వాళ్లిద్దరు ఏళ్ల తరబడి కలిసి క్రికెట్ ఆడిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక పాక్ నటులపై బాలీవుడ్ బ్యాన్ విధించడాన్ని శిల్పా షిండే తీవ్రంగా తప్పుబట్టారు. ‘ కపిల్ శర్మ షో నుంచి సిద్ధును తొలగించడం, పాకిస్తాన్ నటులపై నిషేధం విధించడానికి నేను పూర్తి వ్యతిరేకం. ఉపాధి పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానిని తిరస్కరించే హక్కు ఎవరికీ లేదు. ప్రతిభ ఉన్న పాకిస్తాన్ నటుల హక్కుల కోసం నేను పోరాడుతా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు నిషేధం ఎదుర్కొన్నదాన్నే. అందుకే ఆ బాధ ఏంటో నాకు తెలుసు’ అంటూ శిల్పా షిండే చెప్పుకొచ్చా రు. కాగా టీవీ షో ‘బాబీ జీ ఘర్ పర్ హై’లో అంగూరి బాబీగా ఆదరణ పొందిన శిల్పా బిగ్‌బాస్ 11 విన్నర్‌గా నిలిచి మరింత పాపులర్ అయ్యారు. ఇక ఇటీవలే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.(కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ టీవీ నటి)
Comments
Please login to add a commentAdd a comment