క్లైమాక్స్‌లో... సన్ ఆఫ్ సత్యమూర్తి | Shooting for the yet-to-be-titled Trivikram Srinivas-Allu Arjun film | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్‌లో... సన్ ఆఫ్ సత్యమూర్తి

Published Fri, Jan 30 2015 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

క్లైమాక్స్‌లో... సన్ ఆఫ్ సత్యమూర్తి

క్లైమాక్స్‌లో... సన్ ఆఫ్ సత్యమూర్తి

సకుటుంబంగా చూడదగ్గ కథలను వెండితెరపైకి ఎక్కించడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు త్రివిక్రమ్ చేస్తున్న తాజా ప్రయత్నం - అల్లు అర్జున్ హీరోగా, నిర్మాత ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం. శరవేగంతో షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో వేసిన ఇంటి సెట్‌లో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ సారథ్యంలో సినిమాలోని ప్రధాన తారాగణమంతా పాల్గొనగా, కీలకమైన ఈ చిత్రీకరణ కార్యక్రమాలు సాగుతున్నాయి.

అల్లు అర్జున్, సమంత, నిత్యా మీనన్, రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, ఉపేంద్ర, స్నేహ తదితరులంతా ఈ షూటింగ్‌తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఛాయాగ్రాహకుడు ప్రసాద్ మూరెళ్ళ ఈ కీలక ఘట్టాలను కెమేరాలో బంధిస్తున్నారు. ‘‘ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరణ పూర్తి కానున్న ఈ క్లైమాక్స్‌తో టాకీ షూటింగ్ ముగియనుంది. ఇక ఆ తరువాత మిగిలింది - కొన్ని పాటలు. వాటి చిత్రీకరణకు స్పెయిన్‌కు వెళ్ళనున్నాం’’ అని దర్శక - రచయిత త్రివిక్రమ్ ‘సాక్షి’కి తెలిపారు.  

గతంలో ఇదే దర్శక, నిర్మాత, హీరోల కాంబినేషన్‌లో ‘జులాయి’ చిత్రం రూపొందింది. ఆ విజయోత్సవ చిత్రాన్ని మించేలా ఇప్పుడీ చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్మాత రాధాకృష్ణ పేర్కొన్నారు. ఒక పక్క షూటింగ్ జరుగుతుండగానే, మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని, వేసవి కానుకగా ఏప్రిల్ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని సన్నాహాలు జరుపుతున్నారు.

ఇంతకీ ఈ తాజా సినిమా టైటిల్ ఏమిటి? దీనిపై రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే, అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం చక్కటి ఈ సకుటుంబ కథా చిత్రానికి ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ అని పేరు ఖరారు చేశారు. అధికారికంగా మాత్రం దర్శక, నిర్మాతలు ఈ టైటిల్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం త్రివిక్రమ్ మార్కు వినోదాన్నిస్తుందని ఊహించవచ్చు. మరి, ఈ సమ్మర్‌లో బాక్సాఫీస్ ముందుకు మరో ‘అత్తారింటికి దారేది?’ సిద్ధమవుతున్నట్లేనా? వేచి చూద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement