అప్పుడు రేణు...ఇప్పుడు శ్రుతి
పవన్ కల్యాణ్ పక్కన ఓ హీరోయిన్‌కి రెండో అవకాశం రావడం చాలా అరుదు. గతంలో రేణు దేశాయ్ ఒక్కరే పవన్ సరసన హీరోయిన్‌గా రెండు సినిమాల్లో నటించారు. ఇప్పుడు శ్రుతీహాసన్ ఆ ఫీట్ రిపీట్ చేస్తున్నారు. పవన్ హీరోగా డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించనున్న చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.
కానీ, అంతకు ముందు చాలా తతంగమే నడిచిందట. హీరోయిన్ ఎంపికపై ఫిల్మ్ నగర్‌లో ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ చిత్రం కోసం శ్రుతీని దర్శక-నిర్మాతలు సంప్రదించే సమయానికి ‘ప్రేమమ్’, ‘సింగం 3’, ‘శభాష్ నాయుడు’ సినిమాలతో ఆమె చాలా బిజీ. పవన్‌తో రెండోసారి జోడీ కట్టాలని మనసులో ఉన్నప్పటికీ.. ఏం చేయలేని పరిస్థితి అట.
ఇంతలో కమల్‌హాసన్‌కి గాయమైంది. దాంతో ఆయన నెల రోజుల వరకూ రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో ‘శభాష్ నాయుడు’ షూటింగ్ వాయిదా పడింది. ఆ చిత్రానికి ఇచ్చిన డేట్స్‌ని పవన్ సినిమాకి అడ్జస్ట్ చేశారట శ్రుతీహాసన్.