
అజిత్ చేపలకూర సూపర్
నటుడు అజిత్ వంట పాక శాస్త్రంలో ఆరితేలినట్లున్నారు. ఇప్పటి వరకూ బిరియానీ వండి వార్చడంలోనే సిద్ధహస్తుడని తెలుసు. చేపల కూర కూడా సూపర్‌గా వండగలరని చాలా మందికి తెలియని విషయాన్ని నటి శ్రుతీహాసన్ బట్టబయలు చేశారు. శ్రుతీ భారతీయ సినీ పరిశ్రమలో హాట్‌హాట్‌గా వినిపిస్తున్న పేరు ఇది. తమిళం, తెలుగు, హిందీ ఇలా మూడు భాషల్లో ఏక కాలంలో టాప్ కథాయికగా వెలుగొందటం అంత సులభమైన విషయం కాదు. అలాంటిది శ్రుతీహాసన్ సుసాధ్యం చేసుకోగలిగారు. ఆదిలో ఈమె నట జీవితం కాస్త నత్తనడకన నడిచినా ఇప్పుడు శ్రుతీ సక్సెస్‌కు చిరునామాగా మారారు. క్రేజ్ అన్న పదానికే క్రేజీగా మారారు. స్టార్ హీరోలు శ్రురతీహాసన్‌ను తమకు జంటగా నటించాలని కోరుకుంటున్నారు. అపజయాలను ఎదురొడ్డి విజయాలను వర్తింపజేసుకుంటున్న శ్రుతీహాసన్‌తో చిన్న భేటీ
ప్ర: సినీ జీవితం ఎలా సాగుతోంది?
జ: చాలా సంతోషంగా, ఉత్సాహంగా సాగుతోంది. విజయ్‌తో పులి చిత్రాన్ని పూర్తి చేశాను. ఇందులో నాకు బాగా నచ్చిన పాత్ర చేశాను. ప్రస్తుతం అజిత్‌కు జంటగా నటిస్తున్నాను.త్వరలో సూర్య సరసన సింగం-3లో నటించనున్నాను.
ప్ర: విజయ్, అజిత్, సూర్యతో నటిస్తున్న అనుభవాల గురించి?
జ: 2006లో సూర్యకు జంటగా 7ఆమ్ అరివు చిత్రంతో తమిళంలో నా నట జీవితం ఆరంభమయ్యింది. కఠినమైన శ్రమతోనే ఇలా ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలను అందుకోగలుగుతున్నాను. వీరి నుంచి సినిమాకు సంబంధించిన చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. ఇవన్నీ మంచి అనుభవాలేగా.
ప్ర: గ్లామర్ విషయంలో హిందీలో యమ హాట్‌గా, తెలుగులో కొంచెం హాట్‌గా తమిళంలో మరీ మడి కట్టుకుని నటిస్తున్నారని బాధపడే వారికి మీరిచ్చే బదులు?
జ: ఈ అంశంపై ఇది వరకే ఒకసారి ప్రస్థావించాను. ఇప్పటికీ గ్లామర్ అన్నదానికి అర్థం నాకు తెలియలేదు. ఏది గ్లామర్, దాని పరిధి ఏమిటి? అన్నదీ నాకు తెలియదు. హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో నటించిన రామయ్యా వస్తావయ్యా చిత్రం తెలుగు చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానాకు రీమేక్. అంతకంటే హోమ్లీ పాత్ర ఇప్పుటి వరకూ తమిళంలోనూ, తెలుగులోనూ చెయ్యలేదు. దీనికేమంటారు?. ఏ విషయమయినా కథ, పాత్రలే నిర్ణయిస్తాయి.
ప్ర: మీ అమ్మానాన్నల నుంచి మీరు నేర్చుకోవాలనుకుంటున్నది?
జ: నాన్న నుంచి సమయ పాలన, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం, ఆయన మనోధైర్యం నచ్చుతాయి. ఇక అమ్మ విషయానికొస్తే తను చిన్నతనం నుంచి నటిస్తున్నారు. పలు పోరాటాలను ఎదుర్కొన్నారు. ఆమె సహనం నచ్చుతుంది. ఇవన్నీ నేర్చుకోవాలని ఆశ.
ప్ర: మీరు ఒక చిత్రాన్ని అంగీకరించడానికి కథ, కథానాయకుడు, దర్శకుడు, పారితోషికం వీటిలో ఏ అంశానికి ప్రాధాన్యత నిస్తారు?
జ: ముందుగా కథకు ప్రాధాన్యత నిస్తాను. ఆ తరువాత దర్శకుడెవరన్నది చూస్తాను. ఆపై చిత్ర నిర్మాణ సంస్థ గురించి ఆలోచిస్తా. పారితోషికమూ ముఖ్యమే. అయితే అన్ని చిత్రాలకు ఇలా చెప్పడం కుదరదు. సందర్భానుసారాన్ని బట్టి ఉంటుంది.
ప్ర: కథ బాగుంటే పారితోషికం తక్కువైనా నటిస్తారా?
జ:తప్పకుండా.. ఇప్పటికే ఒకటి రెండు చిత్రాల్లో అలా నటించాను.
ప్ర: మీరు అందరితో సర్దుకుపోతారా లేక వారినే సర్దుకుపోయేలా చేస్తారా?
జ: సర్దుకుపోవడం అనేది పరిస్థితులను బట్టి ఉంటుంది.
ప్ర: మీరు నటిగా కోరుకునే రంగప్రవేశం చేశారా?
జ: నిజం చెప్పాలంటే అనాలోచనగానే నటినయ్యాను. అసలు నాకు దర్శకత్వం, సంగీతం పైనే ఆసక్తి. నా చిన్న నాటి స్నేహితుడు ఇమ్రాన్‌ఖాన్ లక్ అనే చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. మంచి యాక్షన్ స్క్రిఫ్ట్ నువ్వు నటిస్తావా? అని నన్ను అడిగారు. సరే ప్రయత్నిస్తానని అందులో నటించాను. అప్పటి ఆ నిర్ణయమే నన్ను పూర్తి స్థాయి నటిగా మార్చేసింది.
ప్ర: వంట గది వైపు కన్నెత్తి చూసిన సందర్భాలున్నాయా?
జ: అందుకు సమయం ఉండేది కాదు. అయితే వంట పాకంపై ఆసక్తి ఉంది. ముంబయిలో ఉన్నప్పుడు సాంబారు, బంగాళాదుంపల కూర లాంటివి బాగా చేసేదాన్ని. నా స్నేహితులు వచ్చి తినేవారు. మీకో విషయం చెప్పాలి. అజిత్ వంటకాలు ఇష్టంగా తింటాను. ఆయన చేపలకూర వంటకం భలే చేస్తారు. ఆ చేపలకూర తినాలని ఆశ. సమయం దొరికినప్పుడు అజిత్ వద్ద వంటకాల టిప్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను.
ప్ర: మీకు పోటీ ఎవరని భావిస్తున్నారు?
జ: నేనెవర్నీ పోటీగా భావించను. నాకు నేనే సరైన పోటీ. నా ప్రస్తుత చిత్రం కంటే తదుపరి చిత్రంలో ఇంకా ఎంత బాగా నటించాలని ఆలోచిస్తాను.