సవాళ్లతో కూడిన సినిమా : వాణీకపూర్
సవాళ్లతో కూడిన సినిమా : వాణీకపూర్
Published Tue, Sep 17 2013 11:06 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
న్యూఢిల్లీ: నటనలో అనుభవం లేకపోవడం వల్ల శుద్ధ్ దేసీ రొమాన్స్ షూటింగ్ సమయంలో చాలా కంగారు పడ్డానని చెప్పింది ఢిల్లీ యువతి వాణీకపూర్. ఇందులో సుశాంత్‌సింగ్, పరిణీతి చోప్రా ప్రధానపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. జైపూర్ నేపథ్యంగాసాగే ఈ ప్రేమకథను యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఆడిషన్‌లో అందరినీ మెప్పించిన వాణికి ఇందులో అవకాశం ఇచ్చారు. ఈ సంస్థ నుంచి ఎందరో పెద్ద నటులుగా ఎదిగారని, అందుకే షూటింగ్ సమయంలో ఎంతో బాధ్యతగా నడుచుకున్నానని తెలిపింది.
‘నాకు ఇందులో అవకాశం వచ్చిందని తెలియగానే సంతోషం కంటే సవాల్‌ను ఎదుర్కొంటున్నట్టు అనిపించింది. నాపై ఎంతో బాధ్యత ఉందని గ్రహించాను. బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు మనీశ్‌శర్మ, నిర్మాత ఆదిత్యచోప్రాను ఇబ్బంది పెడుతున్నానేమోనని మొదట్లో భయపడ్డాను’ అని వివరించింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ తదనంతరం నిర్మించే మూడు సినిమాల్లోనూ వాణి హీరోయిన్‌గా కనిపిస్తుంది. బ్యాండ్ బాజా బారాత్ తెలుగు/తమిళ రీమేక్‌లోనూ ఈ బ్యూటీ మెరవనుంది. దీనిని కూడా యశ్ సంస్థే తీస్తోంది.
దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ‘కథలో పెద్దగా మార్పు ఉండదు కానీ సాంస్కృతిక అంశాలు మాత్రం వేరుగా ఉంటాయి. మూలకథలోని విషయాలను దక్షిణాది ప్రేక్షకులకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దాం’ అని చెప్పింది. సినీ కుటుంబం నుంచి రాలేదు కాబట్టి నటనకు అలవాటు పడడం కాస్త కష్టమేనని చెప్పిన వాణి మొదట మోడల్‌గా పనిచేసి తరువాత బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ‘మాది ఢిల్లీ. ముంబైలో ఎవరూ తెలియకున్నా అక్కడికి వెళ్లాలి. కాబట్టి బాలీవుడ్‌కు అలవాటుపడడానికి కాస్త సమయం పడుతుంది’ అని వివరించింది.
Advertisement
Advertisement