‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’ | Shweta Tiwari Daughter Palak Open On Alleged Harassment By Abhinav | Sakshi
Sakshi News home page

‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’

Published Tue, Aug 13 2019 4:13 PM | Last Updated on Tue, Aug 13 2019 4:35 PM

Shweta Tiwari Daughter Palak Open On Alleged Harassment By Abhinav - Sakshi

ముంబై : భర్త అభినవ్‌ కోహ్లి తనను మానసికంగా వేధిస్తున్నాడు అంటూ టీవీ సీరియల్‌ నటి శ్వేతా తివారి గృహహింస కేసును నమోదు చేయడంపై కూతురు పాలక్‌ తివారి స్పందించారు. తండ్రి తనను శారీరకంగా వేధించాడంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. కాగా భర్త తనను వేధిస్తున్నాడంటూ శ్వేతా తివారి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో అభినవ్‌ తన కూతురిని కూడా కొట్టాడంటూ  ఆమె ఆరోపించినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ వార్తలపై శ్వేత కూతురు పాలక్‌ తివారి సోషల్‌ మీడియాలో స్పందించారు. కఠిన సమయంలో తన తల్లికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా వెల్లడించిన విషయాలన్నీ వాస్తవాలు కావని కొట్టిపారేశారు. మీడియా ఏదైనా విషయం గురించి ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని, అబద్దాలను ప్రచారం చేయకూడదని సూచించారు.  తన తల్లి అనేక సార్లు గృహహింసకు గురైన విషయం వాస్తవమే కానీ కేసు నమోదు చేసిన రోజు తప్ప ఏ రోజు అభినవ్‌ కోహ్లి తన తల్లిని కొట్టలేదని తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ లేఖ రాశారు.

చదవండి : భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి

అదే విధంగా సవతి  తండ్రి(అభినవ్‌) తనను ఎప్పుడు శారీరకంగా వేధించలేదని.. కనీసం అసభ్యంగా తాకలేదని పాలక్‌ పేర్కొన్నారు. అభినవ్‌ ప్రతీసారి అసభ్యకర వ్యాఖ్యలతో తల్లిని దూషించేవాడని, దానికి ప్రత్యక్ష సాక్షురాలు తనేనని తెలిపారు. ఒక కుటుంబానికి సంబంధించిన అంశాలు సోషల్‌ మీడియాలో తప్పుగా ప్రచురిస్తే ఆ కుటుంబానికి ఎంతో బాధగా ఉంటుందని వాపోయారు. ‘మీరు(మీడియాను ఉద్దేశించి) రాసే వార్తలు ఒకరి జీవితానికి సంబంధించినవని గుర్తుంచుకోవాలి’ అని లేఖలో పేర్కొ‍న్నారు. కాగా పాలక్‌ తివారీ.. శ్వేతా తివారికి మొదటి భర్త రాజా చౌదరి ద్వారా కలిగిన సంతానం. రాజా చౌదరితో విడాకులు తీసుకున్న అనంతరం శ్వేతా తివారి 2013లో అభినవ్‌ కోహ్లిని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement