
ఏమైనా జరుగొచ్చు అంటూ బిగ్‌బాస్‌లో నాని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ ఆ జరిగేదేంటో ప్రేక్షకులకు ముందే తెలిసిపోతే ఎలా ఉంటుందో నాల్గోవారం ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. సోషల్‌మీడియా పుణ్యమా అంటూ బిగ్‌బాస్ ఎంత సస్పెన్స్ మెయింటెన్ చేద్దామనుకున్నా.. అదంతా వృథా అయ్యింది. శ్యామలే ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతోందని ఆదివారం ఉదయం నుంచే ప్రచారం జరిగింది. ఈ వార్త సోషల్‌మీడియా ద్వారానే లీకై వైరల్‌గా మారింది. శ్యామల ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లి వెళ్లిగానే.. ఎలిమినేట్ అయినట్లు, ఇంతవరకు సపోర్ట్ చేసిన ఆడియన్స్‌కు ధన్యవాదాలు, మా బాబుతో కలిసి ఆడుకుంటున్నాను అని పోస్ట్ చేయడం.. అదికాస్తా.. వైరల్ కావడం.. విషయం తెలుసుకున్న బిగ్‌బాస్ బృందం అప్రమత్తం కావడంతో.. శ్యామల అప్పటికప్పుడే ఆ పోస్ట్‌ను తొలగించడం జరిగింది. కానీ అంతలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఆదివారం షో హైలెట్స్
ఆదివారం షో ఆసక్తిగానే జరిగింది. హౌజ్‌మేట్స్‌లో తమకు నచ్చని, విలన్‌గా భావించే వ్యక్తిని విలన్ కుర్చీపై కూర్చోబెట్టే టాస్క్ సరదాగా నవ్వులతో కొనసాగింది. కౌశల్, తనీష్‌లు ఒకరినొకరు సీరియస్‌గా విలన్ సింహాసనంపై కూర్చోపెట్టుకోగా.. దీప్తిసునయన, గణేష్.. కౌశల్‌ను, తేజస్వీ, అమిత్‌ను.. నందిని, సామ్రాట్, బాబు గోగినేనిలు రోల్ రైడాను.. గీతా మాదురి, తనీష్‌ను.. శ్యామల, గీతా మాదురిని కూర్చోబెట్టగా... సీరియస్‌గా సాగే టాస్క్‌లను సరదాగా, సరదాగా సాగే టాస్క్‌లను సీరియస్‌గా చేస్తున్నారని నాని అనడంతో నవ్వులు పూసాయి. అయితే ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉండగానే కౌశల్, తేజస్వీ, బాబు గోగినేనిలు ప్రొటెక్షన్ జోన్‌లో ఉన్నట్లు నాని ప్రకటించారు.
ప్రత్యేక ఓటును ఉపయోగించిన తేజస్వీ, కౌశల్
ఈవారం అందరూ ప్రొటక్షన్ జోన్‌లోకి వెళ్లగా మిగిలిన నందిని, దీప్తి, శ్యామలను ఎలిమినేట్ చేసే బాధ్యతను బిగ్‌బాస్ తీసుకోగా.. కౌశల్, తేజస్వీకి ఉన్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ఓ ఇద్దరిని కాపాడవచ్చని బిగ్‌బాస్ తెలపగా.. కౌశల్ నందినిని, తేజస్వీ దీప్తిని కాపాడగా మిగిలిన శ్యామల కంటతడితో బిగ్‌బాస్ ఇంటి నుంచి వెనుదిరిగింది. శ్యామల వెళ్తూ వెళ్తూ.. ఇంటి సభ్యుల అందరి బట్టలు ఉతకాలనే బిగ్‌బాంబ్‌ను దీప్తిపై వేసింది.