సిల్క్‌స్మిత (ఫైల్)
తమిళసినిమా: ఏనుగు చచ్చినా వెయ్యే బ్రతికినా వెయ్యే అనే సామెత ఉంది. అలా కొందరు జీవించి ఉన్నప్పుడు తను లబ్ధి పొందటంతో పాటు ఇతరులకు లాభాలను అందించారు. అలాంటి వారిలో శృంగార తారగా ముద్ర వేసుకున్న బహుభాషా నటి సిల్క్‌స్మిత చేరుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు బయ్యర్లు చిత్రాలను కొనుగోలు చేసే ముందు సిల్క్ పాట ఉందా? అని అని అడిగి మరీ చిత్రాలను కొనుగోలు చేసేవారు. ఆమె నటించిన చిత్రాలకు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ ఉండేది. అలా నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిన సిల్క్‌స్మిత మరణానంతరం కథకు కాన్సెప్ట్‌గా మారి లాభాలను, అవార్డులను తెచ్చిపెట్టింది. అవును స్మిత జీవిత చరిత్రతో హిందిలో ది దర్టీ పిక్చర్ పేరుతో తెరకెక్కిన చిత్రం సంచలన విజయాన్ని సాధించింది.
అందులో తన పాత్రలో నటించిన విద్యాబాలన్‌కు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అంతే కాదు మలయాళంలోనూ సిల్క్‌స్మిత బయోపిక్‌తో చిత్రం తెరకెక్కింది. ఇదిలాఉండగా ఆమె జీవిత చరిత్ర తాజాగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సిల్క్‌స్మిత జీవితంలో చాలా మందికి తెలియని విషయాలను ఇందులో చూపించనున్నట్టు సమాచారం. అయితే ఇది వెబ్ సీరీస్‌గా రూపొందనుండటం విశేషం. మరో విశేషం ఏమిటంటే కబాలి, కాలా వంటి సంచలన చిత్రాల దర్శకుడు పా.రంజిత్ దృష్టి సిల్క్‌స్మిత బయోపిక్‌పై పడింది. ఆయన తన చిత్ర నిర్మాణ సంస్థలో సిల్క్ జీవిత చరిత్రను వెబ్ సిరీస్‌గా నిర్మించనున్నారు. ఇందులో సిల్క్‌స్మిత ఆరంభ కాలం నుంచి అంతం వరకూ తెరకెక్కించనున్నారు. దీనికి సంబధించిన పూర్తి వివరాలు వెల్లడించకపోయినా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయట. ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment