‘బ్యాడ్‌ టచ్‌’ గురించి బయటపెట్టిన గాయని | Singer Chinmayi opens up about her struggle | Sakshi
Sakshi News home page

వియ్‌ టూ

Published Mon, Oct 8 2018 12:03 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

Singer Chinmayi opens up about her struggle - Sakshi

హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులపై బాధితురాళ్ల బహిరంగ వెల్లడింపులతో సరిగ్గా ఏడాది క్రితం మొదలైన ‘మీ టూ’ మహిళా మహోద్యమం.. ఇన్నాళ్లకు మెల్లిగా బాలీవుడ్‌కూ ధైర్యాన్నిచ్చింది! పదేళ్ల క్రితం నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఇప్పుడు బయట పెట్టడంతో, ఆ స్ఫూర్తితో.. మరికొంతమంది బాలీవుడ్‌ మహిళా ప్రముఖులు తమ జీవితంలోనూ జరిగిన అలాంటి చేదు అనుభవాలను ఒకరొకరుగా బహిర్గతం చేస్తున్నారు. సంఘటితం అవుతున్నారు. తాజాగా చెన్నై గాయని చిన్మయి శ్రీపాద.. ఎదుగుతున్న వయసులో తన మీద పడిన ‘బ్యాడ్‌ టచ్‌’ గురించి బయటికి చెప్పడంతో.. బాధితులకు మద్దతు లభిస్తోంది.  మీ టూ కి.. ‘వియ్‌ టూ’ అని సపోర్ట్‌ ఇచ్చే వారి సంఖ్యా పెరుగుతోంది.

తను పలికినా.. పాడినా మధురమే! ఇది చిన్మయి శ్రీపాద ఐడెంటిటీ. క్లాసిక్స్‌ నుంచి ‘మయ్యా.. మయ్యా..’ లాంటి ఐటమ్‌ సాంగ్స్‌ దాకా.. ఆమె నోట ఏ పాట విన్నా ప్రేక్షకులు మైమరిచిపోవాల్సిందే. డబ్బింగ్‌ చెప్పినా అంతే.. వింటూ ఉండిపోవాల్సిందే! అలాంటి చిన్మయి స్వరం ఈరోజు మారింది. బిటర్‌ చాక్లెట్‌ నమిలి మింగిన వికారాన్ని పంచుకుంది. ప్రపంచంలో ఎవరి.. ముఖ్యంగా ఏ అమ్మాయి బాల్యమూ భయం నీడ సోకకుండా సాగిన దాఖలా లేదు కదా అనిపిస్తోంది... ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్‌ మూవ్‌మెంట్‌ స్టోరీస్‌ విన్నప్పటి నుంచీ. హాలీవుడ్‌ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్‌ దాష్టీకాల వల్ల ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తం అయింది.లైంగిక వేధింపుల గురించి నోరు విప్పచ్చని.. అవి ఎప్పుడు జరిగినా చెప్పుకోవచ్చని.. వేధించిన వాడు సిగ్గు పడాలి కాని.. వేదనకు గురైన వారు కాదని బాధితులకు ధైర్యం ఇచ్చింది. అది మన వాళ్లకూ ప్లాట్‌ఫామ్‌ అయింది. టాలీవుడ్‌లో మెున్న శ్రీరెడ్డి.. బాలీవుడ్‌లో నిన్న తనుశ్రీదత్తా నిజాలను బయటపెట్టారు. ఇప్పుడు చిన్మయి గొంతు విప్పింది. చిన్నప్పటి అలాంటి సంఘటనలను ట్వీట్‌ చేసింది. ‘‘అప్పుడు నాకు ఎనిమిదేళ్లో... తొమ్మిదేళ్లో.. ‘సాంథోమ్‌ కమ్యూనికేషన్స్‌’ స్టూడియోలో మా అమ్మ తన డాక్యుమెంటరీ రికార్డింగ్‌లో ఉంది. నేను అక్కడే నిద్రపోతున్నాను. నా ప్రైవేట్‌ పార్ట్స్‌ టచ్‌ చేస్తున్నట్టు అనిపించి దిగ్గున లేచేసరికి.. నా పక్కనే ఓ పెద్ద మనిషి! 

టీన్స్‌లో ఉన్నప్పుడు కిల్‌పాక్‌ (చెన్నై) బ్రిడ్జ్‌ దగ్గర ఒక ఈవ్‌ టీజింగ్‌ ఇన్సిడెంట్‌ వల్ల నా బైక్‌ యాక్సిడెంట్‌ అయి పడిపోయాను. నా కుడిచేయి కొట్టుకుపోయి.. కదల్లేని స్థితిలో నేనుంటే కొంతమంది మగవాళ్లు పడిపోయిన నా దగ్గరకు వచ్చి నా షర్ట్‌ జేబుల్లో ఏముందో చూసే వంకతో నా చెస్ట్‌ టచ్‌ చేసే ప్రయత్నం చేశారు. ఎంత నీచమైన ప్రవర్తన? ఇలాంటిది చాలామంది అమాయిలకు ఎదురయ్యే ఉంటుంది. నాకు పందొమ్మిదేళ్లప్పుడు.. మళ్లీ ఇంకో సంఘటన. ఈసారీ ఓ పెద్ద మనిషే. తన ఆఫీస్‌కు పిలిచాడు. నేను, అమ్మ ఇద్దరం వెళ్లాం. కాని నన్నొక్కదాన్నే లోపలికి రమ్మన్నాడు. బాగా పరియం ఉన్న వ్యక్తే కాబట్టి వేరే అనుమానాలు లేకుండా.. అసలు రాకుండా.. ఆయన క్యాబిన్‌లోకి వెళ్లాను. ఆయన టేబుల్‌ వెనకనుంచి వచ్చి.. నన్ను హగ్‌ చేసుకున్నాడు.. అసభ్యంగా ప్రవర్తించబోయాడు. 

చిన్మయి.. గత మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో బెదిరింపులు, వేధింపులనూ ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించి ఫిర్యాదూ చేసింది. వాళ్లు అరెస్టయ్యారు కూడా. అయితే అరెస్ట్‌ అయిన తర్వాతా ట్రోలింగ్‌ ఆగలేదు.పేరొందిన మహిళా రచయితలు, కార్యకర్తలూ ఆమెను ట్రోల్‌ చేశారు.. ‘మయ్యా.. మయ్యా.. లాంటి పాటపాడిన సింగర్‌ .. వేధింపులకు వ్యతిరేకంగా కంప్లయింట్‌ చేయకూడదు’ అనే కామెంట్స్‌తో! చాలామంది మగవాళ్లు, ఆడవాళ్లు సపోర్ట్‌ ఇచ్చారు ఆ మాటలకు. అంతేకాదు చిన్మయి మీద యాసిడ్‌ అటాక్‌ చేయాలని, రేప్‌ చేయాలని ఆగ్రహించిన మగవాళ్లూ ఉన్నారు. ఆడవాళ్లే ఆడవాళ్లకు సపోర్ట్‌ చేయని పరిస్థితి అని వాపోయింది చిన్మయి. ఇలా చిన్మయి మీద ఆన్‌లైన్లో కక్కుతున్న విషం చదివి.. యూట్యూబ్‌లో సినిమా రివ్యూలు చెప్పే ప్రశాంత్‌ అనే క్రిటిక్‌.. చిన్మయికి తాను సపోర్ట్‌ చేస్తున్నాను అని చెబుతూ వెంటనే ‘‘డోంట్‌ వర్రీ స్వీట్‌హార్ట్‌/ డార్లింగ్‌.. ఐ విల్‌ సపోర్ట్‌ యూ’’ అని ట్వీట్‌ చేశాడు. ఆయనలా స్వీట్‌హార్ట్, డార్లింగ్‌ అని పిలవడం చిన్మయికి చిరాకు తెప్పించింది. వెంటనే ‘‘డోంట్‌ కాల్‌ మి స్వీట్‌హార్ట్‌’’ అని రిటార్ట్‌ ఇచ్చి ప్రశాంత్‌కి సంబంధించిన డైరెక్ట్‌ మెస్సేజెస్‌ అన్నీ డిలీట్‌ చేసేసింది చిన్మయి. ఇక అప్పటినుంచి ప్రశాంత్‌ కూడా చిన్మయికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మెుదలుపెట్టాడు. అప్పటిదాకా చాలా ఉదాత్తంగా మద్దతునిస్తానన్నవాడు తన అతిని ఆమె తిప్పికొట్టేటప్పటికి అసలు స్వభావం బయటపెట్టుకున్నాడు. 

చిన్మయి ట్వీట్‌ చేయడం చూసి ప్రశాంత్‌ బాధిత మహిళలంతా ఒక్కొక్కరే ట్వీట్స్‌ ద్వారా అతని వేధింపులను బయటపెట్టడం మొదలుపెట్టారు. దీంతో మీ టూ హాష్‌ట్యాగ్‌ ఉద్యమం మళ్లీ ఊపందుకుంది.సినిమా ఇండస్ట్రీ, జర్నలిజం ఫీల్డ్‌లోని లైంగిక వేధింపులన్నీ ఆన్‌లైన్‌లో పుటలు తెరిచాయి. ఉత్సవ్‌ చక్రబర్తీ అనే కమెడియన్‌ అసభ్యకర ప్రవర్తన గురించీ కొంతమంది మహిళలు రాశారు. హఫ్‌పోస్ట్‌ ఇండియా ట్రెండ్స్‌ మాజీ ఎడిటర్‌ అనురాగ్‌ వర్మ, బిజినెస్‌ స్టాండర్డ్‌ జర్నలిస్ట్‌ మయాంక్‌ జైన్, డీఎన్‌ఏ ముంబై ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ గౌతమ్‌ అధికారి, నవలా రచయిత నాగర్‌కర్, కల్చరల్‌ క్రిటిక్‌ (సామాజిక ధోరణుల విమర్శకుడు) సదానంద్‌ మీనన్‌ వంటి వారి వేధింపుల పురాణాలన్నీ బయటకు వస్తున్నాయి. మొన్న శుక్రవారం నుంచి సోషల్‌ మీడియాలో గంటగంటకు ఇలాంటి పేర్లు, హెరాస్‌మెంట్‌ నంబర్లతో మీ టూ జాబితా పెరుగుతూ ఉంది.సైలెన్స్‌ను బ్రేక్‌ చేస్తే వచ్చే నష్టమేమీ లేదు.. పరిష్కారం దొరకడం తప్ప. మహిళ.. మగవాడి సొత్తు కాదు. ఈ మాటను సుప్రీం కోర్టు కూడా తన తీర్పు (497ఏ కేసుకు సంబంధించి)లో చెప్పింది. ఆత్మగౌరవం ఆమె హక్కు కూడా. ఆ ఇంగితంతో మెదలుదాం! ముందుకు కదులుదాం.

వీళ్లు కూడా.. 
కంగనా రనౌత్‌.. పదిహేడేళ్లకే సినిమారంగంలోకి వచ్చింది. ఆ సమయంలో ఆమె ప్రముఖ బాలీవుడ్‌ యాక్టర్‌ ఇంట్లో ఉండేది. కంగనా పెద్ద స్టార్‌ అయ్యాక తనే ఆమె మెంటర్‌నని, గాడ్‌ఫాదర్‌నని చెప్పుకున్నాడు కూడా. అలాంటి వ్యక్తి తనను వేధింపులకు గురిచేశాడని, శారీరకంగా గాయపర్చాడనీ చెప్పింది కంగనా. అంతేకాదు ఆ వ్యక్తి మీద పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐర్‌ నమోదైందనీ తెలిపింది ఆమె. ఆ వ్యక్తి ఎవరో చెప్పడానికి కంగనా ఇష్టపడలేదు కాని ఆమె కెరీర్‌తొలినాళ్లలో గాడ్‌ ఫాదర్‌గా వ్యవహరించింది ఆదిత్య పంచోలి అనే ఊహగానాలూ ఉన్నాయి.

కల్కి కోచ్‌లిన్‌
తొమ్మిదేళ్ల వయసులోనే అబ్యూజ్‌కు గురైన డార్క్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఆమెది. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా గొప్పవాళ్లుగా.. పెద్దవాళ్లుగా చలామణి అవుతున్న వారితోనూ వేధింపులు తప్పలేదని ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది కల్కి. చిన్నప్పటి సంఘటనను ఇప్పటికీ ఓ శాపంలా తలచుకుంటానని అంటుంది కల్కి. 

సప్నా మోతీ భవ్నాని
సెలెబ్రిటీ హెయిర్‌ స్టయిలిస్ట్, బిగ్‌ బాస్‌ సీజన్‌ 6 కంటెస్టెంట్‌.. సప్నా మోతీ భవ్నాని. చిన్నప్పటి నుంచి ప్రేమించి అబ్బాయినే పెళ్లి చేసుకున్నా గృహహింస తప్పలేదు. 24వ యేట షికాగో(అమెరికా) లో గ్యాంగ్‌రేప్‌కి గురైంది. దాన్నీ హింసకు ఒక ఆయుధంగా మలచుకున్నాడు భర్త. అయినా 20 ఏళ్లు సహించింది వివాహ, కుటుంబ వ్యవస్థల మీద గౌరవంతో. తన బలహీనత తన ప్రాణాలనే తీసే దశకు చేరుకున్నాక అప్పుడు ధైర్యం చేసింది. విడాకులు తీసుకొని స్వతంత్రంగా జీవిస్తోంది సప్నా. 

అనూష్క శంకర్‌
తెలుసు కదా.. ప్రఖ్యాత సితార్‌ విద్వాంసుడు రవి శంకర్‌ కూతురు. తన తల్లిదండ్రులు నమ్మి, గౌరవించే వ్యక్తి చేతుల్లోనే చిన్నప్పుడు కొన్నేళ్లపాటు సెక్సువల్‌ అబ్యూజ్‌కు గురయ్యానని..  ‘విమెన్స్‌ రైట్స్‌ క్యాంపెయిన్‌ గ్రూప్‌’  వీడియోలో షేర్‌ చేసుకుంది అనూష్క.  గ్లామర్‌ ఇండస్ట్రీనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలోనూ ఆ మాటకొస్తే ప్రతి ఇంట్లోనూ ఇలాంటి విషాదాలు వినిపిస్తూనే ఉంటాయి అంటారు ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌. నిజమే.. అందుకే గొంతు పెగల్చాలి. ఇలాంటి వాటికి ఎండ్‌ చెప్పాలి. మళ్లీ జరక్కుండా చూడాలి. ‘మీ టూ’ కి.. వియ్‌ టూ (we too) అంటూ సపోర్ట్‌ చేయాలి.  
– శరాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement