జాకీచాన్ సినిమాలో సోనూసూద్
షారూక్ ఖాన్ 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా తరువాత మ్యాన్లీ యాక్టర్ సోనూసూద్ వెండితెర మీద కనిపించడం మానేశాడు. అప్పుడప్పుడు ప్రైవేట్ ఫంక్షన్స్లో కనిపిస్తున్నా తన తరువాతి ప్రాజెక్టుల గురించి మాత్రం స్పందించలేదు. మీడియా అడిగిన సందర్భంలో కూడా ఓ భారీ ప్రాజెక్ట్తో త్వరలోనే మీ ముందుకు వస్తానని చెబుతూ వచ్చాడు. అన్నట్టుగానే ఓ అంతర్జాతీయ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సోనూసూద్.
హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ హీరోగా నటిస్తున్న 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు సోనూసూద్. స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనూసూద్, జాకీచాన్ పాత్రతో సమానమైన పాత్రలో నటించనున్నాడట. అందుకే భారతీయ చిత్రాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు సోనూ. బీజింగ్ తో పాటు భారత్ లోనూ షూటింగ్ జరుపుకుంటున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సోనూసూద్, ఇక అంతర్జాతీయ సినీ అభిమానులకు చేరువైనట్టే అంటున్నారు విశ్లేషకులు.