
ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక పెద్ద సాలెగూడు.యూజువలీ దాన్ని ప్రేక్షకులను పడేయడానికి వాడతారు.ప్రేక్షకులు పడాలంటే సూపర్ హీరోలు ఉండాలిగా.ఇప్పుడు హీరోయిన్‌లే వెబ్‌లో సూపర్ హీరోలు.
గతంలో సినిమాలు చూడాలంటే టెంట్ హాల్స్‌కు వెళ్లాల్సి వచ్చేది. తర్వాత థియేటర్లు వచ్చాయి. ఆపై టీవీల్లో సినిమాలు చూశాం. కంప్యూటర్‌లలో చూస్తున్నాం. ఇప్పుడు అరచేతిలోనే సినిమా ఉంది. సెల్‌ఫోన్‌లో సినిమాలు చూస్తున్నాం. సెల్‌ఫోన్‌లో చూడ్డం కోసమే తీసే సినిమాలూ తయారవుతున్నాయి. వెబ్ సిరీస్, వెబ్ మూవీస్ ఎంటర్ బటన్ దూరంలో ఉన్నాయి. సినిమా స్టార్స్ వీటిలో యాక్ట్ చేసి మరింత స్టార్‌డమ్ పొందుతున్నారు. సెల్‌ఫోన్ సూపర్‌స్టార్స్ వీరు.
ప్రతి ఇంట్లో కనీసం రెండు స్మార్ట్ ఫోన్లు ఉంటున్న రోజులు ఇవి. వినోదానికి సినిమాయే గతి అనే రోజులు మెల్లిగా తగ్గిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వెబ్ సిరీస్‌లు, యూ ట్యూబ్స్ చానెల్స్‌లోని వినోదాత్మక సరుకు పట్ల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో సినిమా స్టార్లు ఈ ప్లాట్‌ఫామ్స్ మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. బాలీవుడ్‌లో మొదలైన వెబ్ సిరీస్‌ల గాలి మెల్లిగా సౌత్‌కు కూడా వీస్తోంది. ముందుగా వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తున్న దక్షిణాది హీరోయిన్లను చూద్దాం.
ఇవి తెలుగు సిరీస్‌లు
హీరోయిన్ నిహారిక డిజిటల్ ఫ్లాట్‌పామ్ ఊపును ముందుగానే పసిగట్టి ఎప్పుడో ‘ముద్దపప్పు ఆవకాయ్’ ‘నాన్న కూచి’ వంటి వెబ్ సిరీస్‌ల్లో నటించారు. ఇప్పుడు కూడా ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారట. కేవలం నటించడమే కాదు వెబ్‌సిరీస్‌లను ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారట నిహారిక. అలాగే తానూ ఓ వెబ్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు హీరో మంచు విష్ణు అనౌన్స్ చేశారు. ఇక ఇండియన్ సినిమాకి గర్వకారణమైన ‘బాహుబలి’ కూడా వెబ్‌లోకి రానుంది. దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు ‘బాహుబలి’ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో చూపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరో సందీప్ కిషన్ కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ పేరుతె ఓ వెబ్ సిరీస్ చేశారు. అయితే హిందీలో తీసిన ఈ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో అనువాదమవుతోంది. అప్పుడప్పుడూ వెండితెర మీద కనిపిస్తున్న అమల ఇటీవల ‘హై ప్రిస్టెస్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా నటించారు. మంచు లక్ష్మీ నటించిన ‘మిసెస్ సుబ్బలక్ష్మీ’ అనే వెబ్ సిరీస్ గురించి ప్రస్తావించాలి. హీరో రానా రెండేళ్ల క్రితమే ‘సోషల్’ అనే వెబ్ సీరిస్‌లో నటించారన్నది మర్చిపోకూడని విషయం. జగపతిబాబు ఆ మధ్య ‘గ్యాంగ్‌స్టార్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఇంకా నవదీప్, తేజస్వి వంటి వారు కూడా వెబ్ సిరీస్‌ల్లో మెరిసిన వారే. ఇటీవల జేడీ చక్రవర్తి ‘ఏ’ వెబ్ సిరీస్‌ను తీస్తున్నట్లు చెప్పారు. తెలుగులోని కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు కూడా వెబ్ సిరీస్‌ల ద్వారా ఆడియన్స్‌కు మరింత దగ్గరవ్వాలనే ఆలోచనలో ఉన్నాయని తెలిసింది.
బాలీవుడ్ హీరోలు చాలా జోరుగా వెబ్ సిరీస్ చేస్తున్నారు. అక్షయ్‌కుమార్ ‘ది ఎండ్’ అనే యాక్షన్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అర్జున్ రాంపాల్ (ది ఫైనల్ కాల్), జాకీ ష్రాఫ్ (క్రిమినల్ జస్టిస్), ఇమ్రాన్ హష్మి (బ్రాడ్ ఆఫ్ బ్లెడ్), హ్యూమా ఖరేషీ (లేలా) ఈ ఏడాది వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ (సేక్రెడ్ గేమ్స్), కల్కి కోచిలెన్ (స్మోక్) సిరీస్‌తో ఇప్పటికే పేరు గడించారు. నిమ్రత్ కౌర్, రాధికా ఆప్టే, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, వివేక్ ఒబెరాయ్, రిచా చద్దా, అంగద్ బేడీ, రాజ్‌కుమార్ రావు, జూహీ చావ్లా.. ప్రస్తుతానికి ఈ వెబ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలో ఉన్న ఇతర బాలీవుడ్ నటులుగా చెప్పుకోవచ్చు. ఈ జాబితా వచ్చే ఏడాదికి మరింత పెరగవచ్చనడంలో సందేహం లేదు.
తమిళంలో ప్రసిద్ధ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా పలువురు ప్రముఖ దర్శకులు సినిమాలు తీయాలనుకున్నారు. ఈ జాబితాలో ఇటీవల మణిరత్నం పేరు కూడా చేరింది. ఆయన ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారని కోలీవుడ్ టాక్. మరోవైపు రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ ఈ నవల ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. సూరియ ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఫస్ట్ హాలిడే
ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు ఓ హాలిడే ట్రిప్‌కు వెళ్లారు. ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇంతలో అనుకోని సంఘటనలు. అంతే! వారి ఆనందం అంతా ఆవిరైపోయింది. ఆ సంఘటనల సమాహారంతోనే ‘హాలిడే’ అనే వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. ‘హార్ట్ ఎటాక్’(2014) సినిమాలో గ్లామరస్‌గా కనిపించి కుర్రకారు గుండెలపై ఎటాక్ చేసిన అదా శర్మ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం మారిషస్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇటీవల ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ వెబ్ సిరీస్ కోసమే డిఫరెంట్ హెయిర్ స్టైల్‌ను చేయించుకున్నారు అదా. వెబ్‌సిరీస్‌లో నటించడం అదాకు ఇదే తొలిసారి. ఇక సినిమాల విషయానికి వసస్తే ఇటీవల విడుదలైన ‘కల్కి’లో నటించారు. అటు ‘కమాండో 3’, ‘మెన్ టు మెన్’, ‘బైపాస్ రోడ్’ సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్‌లోనూ బిజీగా ఉన్నారు అదా.
నిత్యా ఊపిరి
భిన్నమైన పాత్రలు చేసే హీరోయిన్స్ జాబితాలో నిత్యామీనన్ ముందు వరసలో ఉంటారు. ‘అ!’ సినిమాలో నిత్యా లెస్బియన్‌గా నటించడం ఒక ఉదాహరణ. సౌత్‌లో తనకంటూ స్పెషల్ బ్రాండ్‌ను సంపాదించుకున్న మలయాళ సుందరి ఇప్పుడు సెల్‌ఫోన్ ఆడియన్స్‌కు కూడా దగ్గర కావడానికి ‘బ్రీత్’ సెకండ్ సీజన్ వెబ్ సీరిస్‌కు ఊ కొట్టారు. ఈ సెకండ్ సీజన్‌లో నిత్యామీనన్ వంతు షూటింగ్ కూడా పూర్తయింది. నిత్యాకు ఇదే ఫస్ట్ వెబ్ సిరీస్. మయాంక్ శర్మ దర్శకత్వం వహించిన ‘బ్రీత్ 2’లో అభిషేక్ బచ్చన్, అమిత్ సాద్, శ్యామి ఖేర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ప్రముఖ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కు కూడా ఇదే తొలి వెబ్‌సిరీస్. ‘బ్రీత్’ ఫస్ట్ సీజన్‌లో మాధవన్ నటించారు. ఈ ఏడాది హిందీ తెరకూ పరిచయం కానున్నారు నిత్యామీనన్. ఆమె నటించిన హిందీ చిత్రం మిషన్ మంగళ్’ ఆగస్టు 15న విడుదల కానుంది.
వెబ్ మణి
‘పెళ్లైన కొత్తలో’ (2006), ‘యమదొంగ’ (2007), ‘గోలీమార్’ (2010) చిత్రాలలో నటించి ఒకప్పుడు దక్షిణాదిలో బిజీ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న ప్రియమణి ఇప్పుడు డిజిటల్‌లో బిజీ కావాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో నటించడం కూడా మొదలుపెట్టారు. ఇందులో ప్రియమణితో కలిసి బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకులు. మనోజ్ బాజ్‌పాయ్‌కి కూడా ఇదే తొలి వె»Œ æసిరీస్.
గిల్టీ కియారా
‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన కియారా అద్వానీని తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. ఇప్పటికే బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న కియారా గత ఏడాది ‘లస్ట్ స్టోరీస్’లో నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు ‘గిల్టీ’ అనే మరో వెబ్ ఫిల్మ్‌కి సైన్ చేశారు కియారా. రుచి నరైన్ దర్శకత్వం వహిస్తున్నారు. సిటీకి కొత్తగా వచ్చిన ఓ పల్లెటూరి అమ్మాయికి కాలేజీలో ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఈ వెబ్ ఫిల్మ్ తెరకెక్కుతోంది.
కరిష్మా మెంటల్ హుడ్
1990లలో బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా వెలిగిన కరిష్మా కపూర్ 2013 తర్వాత హీరోయిన్‌గా చేయలేదు. కొన్ని సినిమాల్లో మాత్రం అతి«థి పాత్రలు చేశారు. కానీ ఒక ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలనే ఆకలితో ఆమె తిరిగి కెమెరా ముందకు వచ్చారు. ‘మెంటల్ హుడ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఇందులో కరిష్మా వంతు షూటింగ్ కూడా పూర్తయింది. ముంబైలోని ఓ సాధారణ గృహిణి తన ముగ్గురు పిల్లల అలనాపాలనా చూడటానికి ఓ తల్లిగా మానసికంగా ఎన్ని సమస్యలను ఎదుర్కొంటుంది అనే అంశాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.– ముసిమి శివాంజినేయులు
Comments
Please login to add a commentAdd a comment