సీరియల్‌ కిస్సర్‌... | Special story on Kissing king Emraan Hashmi | Sakshi
Sakshi News home page

సీరియల్‌ కిస్సర్‌...

Published Thu, Dec 29 2016 11:51 PM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

సీరియల్‌ కిస్సర్‌... - Sakshi

సీరియల్‌ కిస్సర్‌...

ఇమ్రాన్‌కు కిస్సర్‌ బాయ్‌ అని పేరు.

ఎవరి గురించైనా హిట్స్‌ అండ్‌ ఫ్లాప్స్‌ మాట్లాడుకుంటారు. ఇమ్రాన్‌ గురించి హిట్స్‌ అండ్‌ కిసెస్‌ మాట్లాడుకుంటారు.

ఇమ్రాన్‌కు సినిమాలు చూసే అలవాటు లేదు. నిజంగా అతడి సినిమాలే అనేకం అతడు చూసుకోలేదు.

పెళ్లయ్యాక ఇమ్రాన్‌ తెర మీద ముద్దులు మానేశాడు. భార్యకు నచ్చకపోవడమే కారణం.

ఇమ్రాన్‌ ఇప్పుడు నిర్మాతగా మారాడు. రెండు దేశాల మధ్య యుద్ధంలో నలిగిన పాత్రతో ‘కెప్టెన్‌ నవాబ్‌’ సినిమా చేస్తున్నాడు.


పాటల హీరో
ఇమ్రాన్‌ హష్మీ సినిమాలో పాటలు బాగుంటాయని పేరు. ‘కింగ్‌’ సినిమాలో బ్రహ్మానందం పాడే ‘యాలీ రహమ్‌ వాలీ’ పాట ఉంది కదా... అది ఇమ్రాన్‌ ‘గ్యాంగ్‌స్టర్‌’ సినిమాలోది. ‘జహర్‌’లో సినిమాలోని ‘ఓ లమ్హే ఓ బాతే’... దేశాన్ని ఊపు ఊపింది. ‘ఆషిక్‌ బనాయా ఆప్‌నే’  సినిమాలోని ‘ఆప్‌ కి కషిష్‌’ అయితే ఎన్ని చోట్ల మోగిందో చెప్పలేము.

ఒక ముద్దు ఎంత డబ్బు సంపాదిస్తుంది?
ఊహించండి.
ఇమ్రాన్‌ హష్మీకి ముంబయ్‌లో శ్రీమంతులు నివసించే పాలి హిల్స్‌లో ఒక పెంట్‌ హౌస్‌ ఉంది. దాని ఖరీదు దాదాపు 40 కోట్లు.
ఒకప్పుడు ఇమ్రాన్‌ ఒక సైకిల్‌ కొనుక్కోవడానికి కూడా యోగ్యత ఉన్న వ్యక్తి కాదు.
ఇప్పుడు అంత ఖరీదైన ఇంటికి యజమాని.
దానిని సంపాదించి పెట్టింది ఏమిటో తెలుసా?
ముద్దే!

*********
మహేష్‌ భట్‌ తండ్రి పేరు నానాభాయ్‌ భట్‌. ఈయన మొదటి భార్య ముస్లిం. పేరు షీరీన్‌. మహేష్‌ భట్, నిర్మాత ముకేష్‌ భట్, రచయిత రాబిన్‌ భట్‌ వీరికి పుట్టిన పిల్లలే. షీరీన్‌కు ఒక చెల్లెలు ఉంది. పేరు మెహర్‌బానో. ఒకప్పుడు ఈమె ‘పూర్ణిమ’ పేరుతో సినిమాల్లో నటించింది. ఈమె కొడుకు కుమారుడే ఇమ్రాన్‌ హష్మీ. ఆ విధంగా మహేష్‌భట్‌ సోదరులు ఇమ్రాన్‌కు పెదనాన్న వరుస అవుతారు. ముందు నుంచీ వీరిది సినిమా కుటుంబమే అయినా ఇమ్రాన్‌ హష్మీకి సినిమాలంటే ఆసక్తి లేదు. మామూలుగా డిగ్రీ చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్‌ విపరీతంగా ఆడేవాడు కనుక మహా అయితే అందరిలాగే ఒక స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ఎక్స్‌పర్ట్‌ కావాలని అనుకునేవాడు. అయితే మహేష్‌ భట్‌ పిలిచి, ‘ఎందుకురా ఈ పని ఆ పని మనకో సంస్థ ఉంది. ఇందులోనే ఏదో ఒక పని చేయ్‌’ అని కోరాడు. దాంతో ఇమ్రాన్‌ మొదట ఎడిటింగ్‌లో ట్రై చేశాడు. నచ్చలేదు. ‘రాజ్‌’ సినిమా తీస్తుంటే దానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ పనీ నచ్చలేదు. ఇదంతా గమనించిన ముకేష్‌ భట్‌ యాక్టింగ్‌లో ట్రై చేయ్‌ బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. నేనేం యాక్టింగ్‌ చేసేది అన్నాడు ఇమ్రాన్‌. లేదు నువ్వు చేయగలవు అన్నాడాయన.

*********
దర్శకుడు మహేష్‌ భట్‌ 26 ఏళ్ల వయసులోనే ‘లహూ కే దో రంగ్‌’, ‘అర్థ్‌’ వంటి సినిమాలతో వెలుగులోకి వచ్చాడు. ‘ఆషికీ, దిల్‌ హైకి మాన్‌తా నహీ, సడక్‌’ వంటి కమర్షియల్‌ హిట్స్‌ అనేకం ఇచ్చాడు. ముంబయ్‌ మత కలహాల నేపథ్యంలో ‘జఖ్మ్‌’, పర్విన్‌ బాబీతో తన ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ‘ఫిర్‌ తేరి కహానీ యాద్‌ ఆయీ’ (ఇటీవల ఇదే కథ ‘ఓ లమ్హే’గా భట్‌ నిర్మాణంలో వచ్చింది) వంటి సినిమాలు తీశాడు. అయితే 1998 నాటికి దర్శకుడిగా మహేష్‌ భట్‌ సృజనాత్మకత ముగిసింది. ఇక కొత్త అవతారం దాల్చాడు. రచయితగా ఒక తమ్ముడు, నిర్మాతగా మరో తమ్ముడు ఉన్నాడు కనుక ప్రొడక్షన్‌ కంపెనీ మొదలుపెట్టి సినిమాలు తీయాలని నిశ్చయించుకున్నాడు. వీళ్ల బేనర్‌లో వచ్చిన ‘రాజ్‌’ చిన్న సినిమాలలో అతి పెద్ద హిట్‌. ఆ సినిమాలోని ‘ఆప్‌ కే ప్యార్‌ మే హమ్‌ సవర్‌ నే లగే’... పాట దేశాన్ని ఒక ఊపు ఊపింది. చిల్లర డబ్బుతో తీసిన ఆ సినిమా 2002లో 37 కోట్లు సంపాదించింది. కొంచెం సస్పెన్స్, లేదంటే కొంచెం హారర్, దానికి కాస్తంత రొమాన్స్‌ కలిపి సినిమాలు తీస్తే చూసేవారున్నారని దీనిని బట్టి భట్‌ సోదరులకు అర్థం అయ్యింది. అయితే ఈ తరహా సినిమాలు అందరు హీరోలూ చేయరు. వీటిని మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా లలో సెకండ్‌ గ్రేడ్‌గా చూస్తారు. కనుక తమ సినిమాలకు ఒక హీరో కావాలి. అతను తాము చెప్పినట్టు వినాలి. అవసరం ఉంది. ఎదురుగా మనిషి కనిపిస్తున్నాడు. అలా ఇమ్రాన్‌ హష్మీ హీరోగా కెమెరా ముందు నిలబడాల్సి వచ్చింది.

***********
ఇమ్రాన్‌ హష్మీ తొలి సినిమా ‘ఫుట్‌పాత్‌’ (2003). ఇది సోసోగా ఆడింది. ఆ తర్వాత దర్శకుడు అనురాగ్‌ బసుతో ‘మర్డర్‌’ సినిమా మొదలెట్టారు. హీరోగా హష్మి. హీరోయిన్‌గా మల్లికా షెరావత్‌. దీనిని కొంచెం డోస్‌ పెంచి తీయాలని ముందే నిశ్చయించుకున్నారు. శృంగార సన్నివేశాలు విస్తృతంగా ఉండాలని నియమం. అప్పటి వరకూ అనేక సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు ఉన్నా మహేష్‌ భట్‌ సూచన ఏమిటంటే ‘ముద్దు’ను బహిరంగ పరచండి అని. హాలీవుడ్‌లో చీటికి మాటికి ముద్దు పెట్టుకోవడం సర్వసాధారణం. అలా మన సినిమాల్లో ఎందుకు పెట్టుకోకూడదు, భారతీయులు మాత్రం ముద్దు పెట్టుకోరా అని మహేష్‌ భట్‌ పాయింట్‌. సరే ఇప్పుడు ముద్దు పెట్టుకోవాలి.

************
చాలా మంది ఏమనుకుంటారంటే ముద్దు పెట్టుకోవడం చాలా ఈజీ అని. ఎలాగైనా ముద్దు పెట్టుకోవడం ఈజీనే. కానీ తెర మీద అందంగా ముద్దు పెట్టుకోవడం, అసభ్యత లేకుండా ముద్దు పెట్టుకోవడం ఒక మగాడు ఒక స్త్రీని ముద్దు పెట్టుకున్నట్టుగా పెట్టుకోవడం అందులో ఇబ్బంది కనపడనివ్వకుండా పెట్టుకోవడం.. బాబోయ్‌ చాలా పెద్ద ఫీట్‌. ‘ముద్దు పెట్టుకోవడంలో మీ రహస్యం ఏమిటి?’ అని అడిగితే ‘ఇంకేముంది బోలెడంత మింట్‌ నోటిలో వేసుకోవడమే’ అని నవ్వుతూ చెబుతాడతడు. అయితే మింట్‌ మాత్రమే అతని విజయం కాదు. అతను హీరోయిన్‌ను ముద్దు పెట్టుకోవడం జనానికి నచ్చింది. కుర్రకారు ఆ ముద్దేదో తామే పెడుతున్నట్టుగా భావించుకుని సంతృప్తి పడటం మొదలైంది. మల్లికా షెరావత్‌తో తొలి ముద్దు పెద్ద హిట్‌. ఎంత హిట్‌ అంటే... ఇమ్రాన్‌ ఉంటే ఒక ముదై్దనా చూడొచ్చు అని జనం థియేటర్లకు వచ్చేంత!

************
‘జహర్‌’, ‘చాక్లెట్‌’, ‘గ్యాంగ్‌స్టర్‌’, ‘జన్నత్‌’.... ఈ సినిమాలన్నీ ఇమ్రాన్‌ ముద్దుల వల్లే పెద్ద హిట్‌ అయ్యాయి. ఇండస్ట్రీ మెల్లగా అతణ్ణి ఈ స్థాయి ‘నాఝజరకం’ హీరోగానే చూడటం మొదలుపెట్టింది. ఇది కొన్నాళ్లు కొనసాగి ఉంటే ఇమ్రాన్‌ అయిపోయి ఉండేవాడే. సరిగ్గా అప్పుడే బాలాజీ సంస్థ తరఫున ఏక్తా కపూర్‌ ‘ఒన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై’ మొదలెట్టింది. అందులో 1970ల కాలం నాటి ఒక పైలా పచ్చీస్‌ కుర్రాడిగా ఇమ్రాన్‌ నటించి అందరినీ ఆశ్చర్యపోయాడు. అదేంటి... రెండు పెదాలేసుకొని బతికేసే ఇతను ఇంత బాగా నటించగలడా అని సీరియస్‌ ప్రేక్షకులు కొందరు అనుకున్నారు. విశేషం ఏమిటంటే అమ్మ తల్లి ఏక్తా ఏదైనా కటాక్షించడం మొదలుపెడితే అసలు, కొసరు అంటూ ఉండదు. భారీగా ఉంటుంది. అందుకే ఏక్తా ఆ వెంటనే ఒక ముఖ్యమైన సినిమాలో ఇమ్రాన్‌కు వేషం ఇచ్చింది. ఆ సినిమాయే ‘డర్టీ పిక్చర్‌’. రాజీ పడని డైరెక్టర్‌ పాత్రలో ఇమ్రాన్‌ ఆ సినిమాలో దేశమంతటినీ ఆకర్షించాడు. నిజానికి దేశం మొత్తం మొదటిసారి ఇమ్రాన్‌ను తెర మీద చూసింది. అంతవరకూ ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఇమ్రాన్‌ ఈ సినిమాతో బాలీవుడ్‌లో తన జెండా బలహీనమైనది కాదని, ఇది నిలిచి ఎగిరేదని నిరూపించుకున్నాడు. విద్యా బాలన్, నజీరుద్దీన్‌ షా వంటి నటీనటుల పక్కన గట్టిగా నిలబడగలిగిన ఇమ్రాన్‌ ఇప్పుడు హీరోతో పాటు ‘ఆర్టిస్ట్‌’ కూడా.

************
‘జన్నత్‌ 2, షాంఘై, మర్డర్‌ 2, ఏక్‌ థీ దాయన్‌...’ ఇవన్నీ ఇమ్రాన్‌ హిట్స్‌. వీటిని మించి బిపాషా బసుతో చేసిన ‘రాజ్‌3’ సినిమా 97 కోట్లు వసూలు చేసింది. ఈ సమయంలో మన క్రికెటర్‌ అజహరుద్దీన్‌ బయోపిక్‌ ‘అజహర్‌’లో నటించే అవకాశం ఇమ్రాన్‌కు వచ్చింది. ఒక ముంబై హీరో ఒక హైదరాబాదీ ఆటగాడి పల్స్‌ను పట్టుకోవడం కష్టం. కాని ఇమ్రాన్‌ ఆ విన్యాసం సాధించాడు. అజహరుద్దీన్‌లా నడవడం, బ్యాట్‌ పట్టుకోవడం, షాట్‌ కొట్టడం ఇవన్నీ నేర్చుకున్నాడు. సినిమా విజయం ముక్తసరిగా ఉన్నా ఇమ్రాన్‌ యాక్టింగ్‌కు చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా అజహర్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చినా, అతగాడు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆ నాటి కేసును విచారించిన అధికారి సినిమా రిలీజ్‌ అయ్యాక స్టేట్‌మెంట్‌ ఇచ్చాడనేది అదనపు సమాచారం.

************
1988లో వచ్చిన ఆమిర్‌ ఖాన్‌ ఇప్పటికి దాదాపు 50 సినిమాలు పూర్తి చేశాడు. కానీ, 2002లో వచ్చిన ఇమ్రాన్‌ అప్పుడే నలభై సినిమాలకు చేరువ అయ్యాడు. సినిమాలు, కుటుంబం తప్ప వేరే వ్యాపకాలు లేకపోవడం, వేగంగా సినిమాలు ఎంచుకొని వేగంగా పూర్తి చేయడం వల్లనే ఇది సాధ్యం అయ్యింది. ఆరేళ్లుగా ప్రేమించిన పర్వీన్‌ షహానీని 2006లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఒక కుమారుడు అయాన్‌. అయితే ఇంతలో చిన్న విషాదం. నాలుగేళ్ల వయసు ఉండగా అయాన్‌కు ఫస్ట్‌ స్టేజ్‌ కేన్సర్‌ ఉన్నట్టు కనుగొన్నారు. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆ పిల్లవాడు ఆరేళ్లు నిండి, హాయిగా ఉన్నాడు. ‘కానీ వాడికేదైనా అవుతుందేమోనన్న భయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది’ అంటాడు ఇమ్రాన్‌.

***********
తెలుగులో ఇప్పుడు హారర్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది కాని దేశంలో ఈ ట్రెండ్‌ను మొదలెట్టి స్థిరంగా కొనసాగించిన హీరో ఇమ్రాన్‌ హష్మీ. హారర్, సెక్స్‌ ఈ రెండూ కలగలసిన ఫార్ములాను సభ్యత పరిధిలోకి స్త్రీ పురుషులు కలిసి చూసేలా చేయగలిగాడతడు. అన్నింటి కంటే మించి ప్రతి పనికీ ఒక స్పేస్‌ ఉంటుందనీ, దాన్ని  సరిగ్గా చేస్తే ఆ స్పేస్‌ను ఆదరించి హత్తుకునే ప్రేక్షకులు ఉంటారనీ నిరూపించిన హీరో కూడా అతడు. చూడటానికి పెద్ద విశేషంగా కనిపించకపోయినా భిన్నమైన దారిలో నడవడం వల్లే అతడు ఇవాళ స్టార్‌ కాగలిగాడు.
అందుకే ఇమ్రాన్‌ను చూస్తే ‘ప్చ్‌’ అని నిట్టూర్పు రాదు.
‘మ్చ్‌’ అని ముద్దు గుర్తుకు వస్తుంది.
‘మ్చ్‌’.
– సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement