సినీ నటి శ్రీరెడ్డి (ఫేస్‌బుక్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న సినీ నటి శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో శుక్రవారం సభ్యత్వ రుసుము చెల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో తాను సభ్యత్వ రుసుము ఇవ్వలేదన్న ప్రచారం సరికాదని పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పాలక వర్గం సభ్యత్వం ఇచ్చినా, ఇవ్వకపోయినా సినీ పరిశ్రమలోని సమస్యలపై పోరాటం కొనసాగుతుందని రెండు రోజుల క్రితం ఫిలించాంబర్‌లో మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ‘మా’ సభ్యత్వం ఇస్తారా..? లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై ఇంత వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాగా, ఈనెల 2న ‘మా’ కార్యాలయానికి వెళ్లి తన సభ్యత్వం విషయమై అకౌంటెంట్ ప్రసాద్‌ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ‘మా’ సభ్యత్వం ఇస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలాగా తన ఉద్యమం ఉంటుందని ఈ సందర్భంగా శ్రీరెడ్డి ప్రకటించారు. తెలుగు హీరోయిన్లకు 70 శాతం అవకాశాలు ఇప్పించేలా సినీ పెద్దలను ఒప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. చిత్ర పరిశ్రమలో మహిళలపట్ల జరుగుతున్న లైంగిక వేధింపుల (కాస్టింగ్ కౌచ్) నిరోధానికి ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కమిటీలో మహిళా సంఘాలకు అవకాశం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment