
కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ అడ్డాల, తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ బ్రహ్మోత్సవం సినిమా శ్రీకాంత్ కెరీర్‌ను తల కిందులు చేసింద. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మోత్సవంకు డిజాస్టర్ టాక్ రావటంతో శ్రీకాంత్ అడ్డాలకు అవకాశాలే కరువయ్యాయి. లాంగ్ గ్యాప్ తరువాత ఇటీవల గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.
సంక్రాంతి సందర్భంగా సొంత ఊరు రేలంగికి వెళ్లిన శ్రీకాంత్ అడ్డాల అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తాను చేయబోయే సినిమాకు ‘కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్టుగా చెప్పారు. అంతేకాదు లోక నాయకుడు కమల్ హాసన్, టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌ల కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ కథను రెడీ చేస్తున్నట్టుగా చెప్పారు. త్వరలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు.