Sakshi Interview With Priyamani On Narappa Movie, Priyamani Sakshi Interview Highlights - Sakshi
Sakshi News home page

ఆ సీన్‌ గురించి చెబితే కథ మొత్తం చెప్పినట్లే: ప్రియమణి

Published Fri, Jul 16 2021 12:36 AM | Last Updated on Fri, Jul 16 2021 1:27 PM

Sakshi Interview About Priyamani On Narappa Movie

పదేళ్ల క్రితం ‘పరుత్తివీరన్‌’కి జాతీయ అవార్డు అందుకున్నారు. అందులో పల్లెటూరి పిల్ల ముత్తళుగు. ఇప్పుడు ‘నారప్ప’లోనూ అంతే.. పల్లెటూరి సుందరమ్మ. పెళ్లీడుకొచ్చిన అబ్బాయికి తల్లి. అంత పెద్ద కొడుకు ఉన్న వయసు కాదు ప్రియమణిది. కానీ పాత్ర ఏదైనా చేయాలని ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. వెంకటేశ్, ప్రియమణి జంటగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప’   ఈ నెల 20 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ప్రియమణి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...

► ‘నారప్ప’ అంటే కెరీర్‌ ఆరంభంలో మీరు నటించిన ‘పరుత్తివీరున్‌’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమాలో ముత్తళగు పాత్రలో కనిపించినట్లుగానే ఇప్పుడు ‘నారప్ప’లో సుందరమ్మ లుక్‌ కూడా ఉంది...
‘పరుత్తువీరన్‌’లో విలేజ్‌ అమ్మాయిని. ఇందులోనూ అంతే. అయితే తెలుగులో ‘నారప్ప’లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. తమిళంలో విలేజ్‌ క్యారెక్టర్లు చేశాను కాబట్టి తెలుగులో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదీ వెంకీసార్‌తో వర్క్‌ చేయడం అంటే నాకు ఒక బోనస్‌. తెలుగు సినిమా కాబట్టి డబుల్‌ బోనస్‌.

► ఉన్నదానికంటే బ్రైట్‌గా కనబడటానికి మేకప్‌ చేసుకుంటారు. కానీ ‘నారప్ప’, ‘విరాటపర్వం’లో ట్యాన్‌ అయిన స్కిన్‌తో కనబడాల్సి రావడం గురించి..
‘నారప్ప’లో నేను మాత్రమే కాదు.. సినిమాలో ఉన్న నటీనటులందరూ కాస్త డల్‌గానే కనబడాలి. ట్యాన్‌ అయినట్లుగా కనిపించాలి. ‘విరాటపర్వం’లో నక్స్‌లైట్‌ (పాత్ర పేరు భారతక్క)ని కాబట్టి స్కిన్‌ టోన్‌ని డార్క్‌ చేయించాం. మామూలుగా బ్రైట్‌గా కనిపించడానికి మేకప్‌ చేసుకోవాలి. సుందరమ్మ, భారతక్క పాత్రల్లో డల్‌గా కనిపించడానికి కష్టపడాలి (నవ్వుతూ).


► తమిళ ‘అసురన్‌’కి రీమేక్‌‘నారప్ప’. తమిళంలో మంజు వారియర్‌ చేసిన పాత్రను తెలుగులో మీరు చేశారు కాబట్టి పోలికలు పెట్టే అవకాశం ఉంటుంది...
రీమేక్‌ చేసేటప్పుడు పోలికలు పెడతారు. ఏమీ చేయలేం. అది సహజం. మంజు వారియర్‌ అద్భుతమైన నటి. అయితే నా బెస్ట్‌ ఇవ్వడానికి ట్రై చేశాను. ఎంత చేయాలో అంతా చేశాను. పేరు వస్తే హ్యాపీ.

► రొటీన్‌కి భిన్నంగా సుందరమ్మ పాత్రకు చీర కాస్త పైకి కట్టుకుని కనిపించారు.. కాస్ట్యూమ్స్‌ గురించి చెప్పండి?
అన్నీ కాటన్‌ చీరలే కట్టుకున్నాను. చీర కట్టుకుని బయటకి రాగానే నా పర్సనల్‌ స్టాఫ్‌ ‘ఏంటి మేడమ్‌.. ఇంత పైకి కట్టుకున్నారు’ అన్నారు. వాళ్లంతా ముంబయ్‌వాళ్లు. ఈ క్యారెక్టర్‌కి ఇలానే కట్టాలన్నాను. హెయిర్‌ స్టయిల్‌ కూడా నేనే చెప్పి చేయించుకున్నాను. పొరపాటున ఫేస్‌ ఫ్రెష్‌గా కనిపించిందనుకోండి.. వెంటనే వచ్చి డల్‌ చేసేసేవారు (నవ్వుతూ).

► ఓకే.. కరోనా వల్ల అన్నీ తలకిందులు కావడంతో ‘ఫ్యూచర్‌ ప్లాన్స్‌’ గురించి చాలామంది ఆలోచించడంలేదు. మరి.. మీరు?
నిజానికి నేనెప్పుడూ ఫ్యూచర్‌ని ప్లాన్‌ చేయలేదు. ఒక పదేళ్లల్లో ఇది చేయాలి? రెండేళ్లల్లో ఇలా ఉండాలి.. ఇది చేయాలి అని నేనెప్పుడూ ఫ్యూచర్‌ గురించి ఆలోచించలేదు. జీవితం ఎటు వెళితే అలా వెళుతుంటాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని, మన ఫ్యామిలీని సేఫ్‌గా కాపాడుకోవడం ముఖ్యం. అందరూ వ్యాక్సినేషన్‌ తీసుకుంటున్నారు, తీసుకోనివాళ్లు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థర్డ్‌ వేవ్‌ చాలా ప్రమాదకరంగా ఉంటుందట. అందుకే అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పని ఉంటేనే బయటికెళ్లాలి. ఇంట్లో ఉన్నప్పుడు ‘నారప్ప’ని చూడాలని కోరుకుంటున్నాను.

► ఈ సినిమాలో పెళ్లి వయసులో ఉన్న అబ్బాయికి అమ్మలా నటించారు.. ఇకముందు కూడా చేస్తారా?
‘ది ఫ్యామిలీ మేన్‌’ వెబ్‌ సిరీస్‌లో, ఒక మలయాళం సినిమాలోనూ అమ్మ పాత్ర చేశాను. ఒక పాత్రని పాత్రలా చూడగలగాలి. ఆ పాత్ర ప్రేక్షకులను మెప్పించేలా చేయాలి. ఒక క్యారెక్టర్‌ ఒప్పుకునే ముందు నేను అనుకునేది ఇదే.

► సినిమాల్లో, వెబ్‌ సిరీస్‌లో తల్లి పాత్రలు చేస్తున్నారు. మరి.. రియల్‌ లైఫ్‌లో ఎప్పుడు..?
(నవ్వుతూ) ఇప్పుడు కాదండీ.. కొంచెం టైమ్‌ పడుతుంది.

► మీ భర్త ముస్తఫా ఎలా ఉన్నారు?
ఆయన యూఎస్‌లో ఉన్నారు. తన పనులతో బిజీ. ఎవరు ఎక్కడ ఉన్నా ఈ కరోనా టైమ్‌లో సేఫ్టీగా ఉండటం ముఖ్యం. ఆ విషయంలో మేం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

► మీ పాత్రకు మీరే డబ్బింగ్‌ చెప్పారు కదా.. అనంతపురం స్లాంగ్‌ని పట్టగలిగారా?
రెగ్యులర్‌ తెలుగు అయితే ఇబ్బంది ఉండేది కాదు. అనంతపురం స్లాంగ్‌కి నాకు కొంచెం టైమ్‌ పట్టింది. అనంతపురం నుంచి ఒకాయన వచ్చి నేర్పించారు. డబ్బింగ్‌ చెప్పే ముందు పదాలు ఎలా పలకాలో చెప్పేవారు. రెండు మూడుసార్లు అనుకుని చెప్పేశాను. అయితే పదీ ఇరవై నిమిషాల్లోనే స్లాంగ్‌ని పికప్‌ చేయగలిగాను.

► ఈ సినిమాలో మిమ్మల్ని కష్టపెట్టిన సీన్‌?
ఉంది. ఆ సీన్‌ గురించి చెబితే కథ మొత్తం చెప్పినట్లే. నాకు ఎమోషనల్‌ సీన్స్‌ చేయడం చాలా ఇష్టం. ఛాలెంజ్‌గా తీసుకుంటాను. ఈ సినిమాలో అలాంటి ఒక సీన్‌ ఉంది. అది నాకు పెద్ద సవాల్‌లా అనిపించింది. ఫిజికల్‌గా ఛాలెంజ్‌ కాదు.. మెంటల్లీ ఛాలెంజ్‌ అన్నమాట. బాగా చేయగలిగాను. ప్రేక్షకుల రెస్పాన్స్‌ ఎలా ఉంటుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement