
ఆ వివాదం గురించి మాట్లాడటం నాకిష్టం లేదు : శ్రీను వైట్ల
‘ఆనందం’ సినిమా తరహాలో త్వరలో మంచి ప్రేమకథ చేయాలని ఉందంటున్నారు శ్రీను వైట్ల. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శ్రీను విలేకరులతో ముచ్చటించారు.
‘ఆనందం’ సినిమా తరహాలో త్వరలో మంచి ప్రేమకథ చేయాలని ఉందంటున్నారు శ్రీను వైట్ల. నేడు ఆయన పుట్టినరోజు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శ్రీను విలేకరులతో ముచ్చటించారు.
ఇటీవల విడుదలైన ‘ఆగడు’లో హీరో మొదలుకొని అందరితోనూ అంత వేగంగా డైలాగులు చెప్పించారేం?
డైలాగుల విషయంలో కొత్తగా వెళ్లాలనిపించింది. అందుకే... రిథమిక్‌గా డైలాగులు చెప్పించాను. ఇది యూనిట్ మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయం. ముఖ్యంగా మహేశ్ డైలాగులు, విలన్లను బురిడీ కొట్టించడానికి ఆయన చెప్పే చిన్న చిన్న పిట్టకథలు ప్రేక్షకులకు నచ్చాయి.
‘ఆగడు’ నుంచి తానెందుకు తప్పుకోవాల్సి వచ్చిందో నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు. మీకూ, ఆయనకు వచ్చిన అభిప్రాయ భేదాల గురించి కూడా ఆ ప్రెస్‌మీట్‌లో చర్చించారు. మరి మీరెందుకు ఈ విషయంపై సెలైంట్‌గా ఉన్నారు?
నాకు, ఆయనకూ మధ్య అభిప్రాయా బేధాలు తలెత్తాయి. దానికి ఆయన ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. నేను ప్రెస్‌మీట్ పెట్టలేదు. పెట్టను కూడా. అసలు ఆ వివాదం గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు... దట్సాల్.
ఆ ప్రెస్‌మీట్‌లో ప్రకాశ్‌రాజ్ చెప్పిన కవితను, సినిమాలో సోనూసూద్‌తో చెప్పించినట్లున్నారు?
నాకు ఆ కవిత నచ్చిందండీ... అందుకే సోనూసూద్‌తో చెప్పించాను.
ఆ పాత్రను సోనూసూద్‌తోనే చేయించడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
అలాంటిదేం లేదు. ఆ పాత్రను ఎవరైనా బాగానే చేస్తారు. సోనూసూద్ చేస్తే పెర్‌ఫార్మెన్స్‌తో పాటు స్టార్ వేల్యూ కూడా ఉంటుందని చేయించాను.
క్లైమాక్స్‌లో బ్రహ్మానందం చేత కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి మరీ డాన్సులు చేయించారు. అంత అవసరమా?
సినిమా ఒక వ్యాపారం. ఇక్కడ ఏది వర్కవుట్ అయితే అటే వెళతారు. దానికి ప్రేక్షకుల అప్లాజ్ బాగుంది.
కోన వెంకట్, గోపీ మోహన్ మీ టీమ్ నుంచి తప్పుకోగానే...డైలాగులు మీద ఇంతకు ముందుకంటే మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కనిపించిందని పలువురి అభిప్రాయం?
మాటల రచయితగా నేను కొత్తగా నిరూపించుకోవాల్సిందేం లేదు. ‘దూకుడు’ సినిమా కథ, కథనం, సంభాషణలు నావే. ఎవరో రాసిన మాటల్ని నావి అని వేసుకుంటే ఊరుకోరు కదా. కోన వెంకట్ కావచ్చు. ఇంకెవరైనా కావచ్చు వారి క్రెడిట్‌వారిదే. నా క్రెడిట్ నాదే.
నెక్ట్స్ రామ్‌చరణ్‌తో సినిమా అంటున్నారు నిజమేనా?
ఒక వారంలో నా తర్వాత ప్రాజెక్ట్ గురించి చెబుతాను. హీరో గురించి కూడా అప్పుడే చెబుతా.