నిజమే... మహాభారతమే!
ఇంతకు ముందోసారి హిందీ హీరో ఆమిర్‌ఖాన్‌ను కలసినప్పుడు మహాభారతం గురించే మాట్లాడానని దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. హిందీ హిట్ ‘దంగల్’ ప్రచార కార్యక్రమాలకు హైదరాబాద్ వచ్చిన ఆమిర్‌ను ఇదే అంశమై ప్రశ్నించగా... ‘‘రాజమౌళిని ఓసారి కలిశా. కానీ, సినిమా గురించి ఏం మాట్లాడలేదు’’ అన్నారు. ఒకవేళ రాజమౌళి కలల సినిమా ‘మహభారతం’లో ఛాన్స్ వస్తే నటిస్తారా? అని ఆమిర్‌ను అడగ్గా... ‘‘కృష్ణుడిగా నటించడానికి ఇష్టపడతా’’ అన్నారు.
అమితాబ్ బచ్చన్, మోహన్‌లాల్, ఆమిర్‌ఖాన్ ముఖ్య పాత్రధారులుగా సుమారు 600 కోట్లతో మహాభారతాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. దీనిపై తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ఇంతకు ముందు చెప్పినట్టు మహాభారతాన్ని చిత్రంగా తీయాలనుంది. తప్పకుండా చేస్తా. కానీ, ‘బాహుబలి’ తర్వాత మాత్రం కాదు. ‘మహా భారతం’ అనేది క్లాసిక్, ఓ ఎపిక్. నాకు టైమ్ కావాలి. ఆమిర్‌ఖాన్‌తో ‘మహాభారతం’ గురించి చర్చించిన మాట వాస్తవమే. ఈ సినిమా చేయాలని ఆయన కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు’’ అన్నారు.