రామ్‌చరణ్, ఎన్టీఆర్
‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రీకరణ కరోనా వల్ల సాధ్యం కాకపోవడంతో రాజమౌళి అండ్ టీమ్ ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. లాక్‌డౌన్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చిన తర్వాత చిత్రీకరణను మొదలుపెట్టాలని అనుకున్నప్పటికీ కరోనా ప్రభావం మెండుగా ఉండటంతో షూటింగ్ జరిపేందుకు మరికొంత సమయం వేచి ఉండాలని చిత్రబృందం అనుకుందట. ఈ ఖాళీ సమయంలో గ్రాఫిక్స్ వర్క్ పై ప్రత్యేక దృష్టి సారించారు రాజమౌళి.
కాగా ఈ సినిమాలో కీలకమైన యానిమేషన్ ఎపిసోడ్స్ ఉన్నాయని టాక్. ఈ ఎపిసోడ్స్‌తో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలకు సంబంధించిన కొన్ని విషయాలను ప్రేక్షకులకు చెబుతారట రాజమౌళి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్స్‌కు సంబంధించిన వర్క్‌ను వర్చువల్‌గా సూపర్‌వైజ్ చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారని సమాచారం. సముద్రఖని, శ్రియ, అజయ్ దేవగన్, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ ఈ చిత్రంలో కీలక పాత్రధారులు. ఇప్పటికే 70 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment