
షూటింగ్‌లో సందీప్ కిషన్
సాక్షి, కర్నూల్: యువ హీరో సందీప్ కిషన్ షూటింగ్‌లో గాయపడ్డాడు. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమా షూటింగ్‌లో భాగంగా కర్నూల్‌లో పోరాట సన్నివేశం చిత్రీకరిస్తుండగా అతడికి గాయాలయ్యాయి. పైట్ మాస్టర్ తప్పిదం వల్ల జరిగిన బాంబ్ బ్లాస్ట్ సన్నివేశంలో అతడు గాయపడినట్టు సమాచారం. సందీప్ కిషన్ ఛాతీ, కుడి చేతిపై గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే కర్నూలు మై క్యూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు. అది పూర్తయిన అనంతరం హైదరాబాద్ అపోలో హాస్పటల్‌కి తరలిస్తారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది.
నిన్న వైజాగ్ షూటింగ్‌లో మరో యువ హీరో నాగశౌర్య కూడా గాయపడ్డాడు. నూతన దర్శకుడు రమణ తేజ తెకెక్కిస్తున్న సినిమాలో ఫైటింగ్ సీన్ తీస్తుండగా అతడి కాలికి గాయమైంది. నాగశౌర్యకు 25 రోజుల విశ్రాంతి అవసరం అని తేల్చడంతో షూటింగ్‌ను వాయిదా వేశారు.
మెగా యువ హీరో వరుణ్ తేజ్ రెండు రోజుల క్రితం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయిణిపేట వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అంతకుముందు రాంచరణ్ కూడా గాయపడటంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ కొన్నిరోజులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. నువ్వు తోపురా సినిమాలో హీరోగా నటించిన సుధాకర్ కోమాకుల కూడా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద జరిగిన కారు ప్రమాదంలో గాయాలతో అతడు బయటపడ్డాడు. హీరోలు వరుస ప్రమాదాలకు గురవుతుండడం పట్ల సినిమా పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment