ఈ యువ హీరోలకు ఏమైంది! | Tollywood Heroes Who Injured in Shooting Sets Recently | Sakshi
Sakshi News home page

ఈ యువ హీరోలకు ఏమైంది!

Published Sun, Jun 16 2019 7:00 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

Tollywood Heroes Who Injured in Shooting Sets Recently - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరానికి ఏమైంది అన్నట్లు.. ఇది వింటే ఈ యువ హీరోలకు ఏమైంది అంటారు. నిజమే వరుసగా గాయాలపాలవుతున్న యువహీరోలను చూస్తే అసలేమైంది. ఎందుకు ఇలా అవుతుంది అనే సందేహం రాక మానదు. టాలీవుడ్‌ తలరాత బాలేదా లేక మన హీరోల జాతకం బాలేదా లేక ఏమైనా దోషం పట్టుకుందా అన్న అనుమానం వస్తుంది. మొన్నేమో వరుణ్‌తేజ్.. నిన్నేమో నాగశౌర్య.. సందీప్‌ కిషన్.. తాజాగా ఇవాళేమో శర్వానంద్‌... ఇలా ఒక్కొరు ప్రమాదాలకు గురవుతూ వస్తున్నారు. ఇంతకు మన టాలివుడ్‌కు ఏమైందంటారు. 

నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాణిపేట దగ్గర ఎదురుగా వస్తున్న ఇండికా కారును వరుణ్‌తేజ్‌ ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో వరుణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. వరుణ్‌తేజ్‌ యధావిధిగా షూటింగ్‌లో పాల్గొంటాడని చిత్ర యూనిట్‌ తెలిపింది.  

ఇక సినిమా షూటింగ్‌లో భాగంగా యువ హీరో నాగశౌర్య గాయపడ్డారు. కొత్త దర్శకుడు రమణతేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా వైజాగ్‌లో ఓ భారీ యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. ఎలాంటి డూప్‌ లేకుండా రోప్‌ లేకుండా నాగశౌర్య రియల్‌ స్టంట్‌ చేశాడు. ఆ సమయంలో గోడపై నుంచి దూకిన నాగశౌర్య కాలికి గాయమైంది. దీంతో కంగారుపడ్డ చిత్ర బృందం వెంటనే నాగశౌర్యను ఆస్పత్రికి తరలించారు. నాగశౌర్యను పరిశీలించిన వైద్యులు 25 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. 

యువ నటుడు సందీప్‌ కిషన్‌ కూడా ఇదే తరహాలో గాయపడ్డారు. సందీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెనాలి రామకృష్ణుడు సినిమా చిత్రీకరణ కర్నూలు పరిసరాల్లో జరుగుతోంది. షూటింగ్‌లో భాగంగా ఓ ఫైట్‌ సీన్‌ చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు బస్సులో నుంచి దూకే సన్నివేశంలో సందీప్‌ గాయపడ్డాడు. దీంతో చిత్ర బృందం వెంటనే కర్నూలు పట్టణంలోని మైక్యూరమ్ ఆస్పత్రికి తరలించారు. అయితే సందీప్‌కు ప్రమాదమేమి లేదని ఆయనకు తగిలింది స్వల్ప గాయాలేనని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ఇవాళ హైదరాబాద్‌కు చేరుకుంటారని చిత్ర దర్శకుడు నాగేశ్వరరెడ్డి తెలిపారు. 

తాజాగా ఈ గాయాల కూటమిలో శర్వానంద్ కూడా చేరిపోయాడు. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 96 సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా స్కై డైవ్‌ చేస్తుండగా శర్వానంద్‌ జారీ కిందపడ్డాడు. భుజంతోపాటు కాలుకు తీవ్ర గాయాలు కావడంతో చిత్ర బృందం శర్వానంద్‌ను వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌కు చేరుకున్న శర్వానంద్‌ నేరుగా సన్‌షైన్‌ ఆస్పత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు శర్వానంద్‌ భుజంతోపాటు కాలుకు బలమైన గాయమైందని.. సర్జరీ చేయాలని సూచించారు. దీంతో శర్వానంద్‌కు సోమవారం సర్జరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement