ఆయన అండ ఉంటే చాలు!
సెక్సీ స్టార్ సన్నీ లియోన్ మోస్ట్ డిజైరబుల్ ఉమన్‌గా ఎంపికయ్యారు. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే లాంటి టాప్ హీరోయిన్స్‌ని పక్కనబెట్టి ఆమె నం.1గా నిలిచారు. ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్‌లో జరిపిన ఈ సర్వేపై సన్నీ స్పందిస్తూ -‘‘నాకు నచ్చిన విధంగా జీవితాన్ని గడుపుతున్నాను. మిగిలిన వాళ్లకెలా ఉన్నా... ఎంత వయసొచ్చినా నా భర్త డేనియల్‌కు మాత్రం ఎప్పటికీ మోస్ట్ డిజైరబుల్‌గా మిగిలిపోవాలని ఆశ. నేను ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో స్థిరపడుతున్నా.
నా భర్త ప్రోత్సాహంతోనే ఇంతవరకూ రాగలిగాను. ఆయన అండ ఉంటే చాలు’’ అని చెప్పారు. ‘‘నిర్మాత ఏక్తా కపూర్‌తో మీకు గొడవ జరిగిందటగా?’’ అనడిగితే ‘‘అలాంటిదేం లేదు. నాకు ఆమె అంటే చాలా గౌరవం. ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్’ చిత్రం గురించి ఆమె నన్ను సంప్రతించారు. కానీ అందులో హద్దుమీరే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇది వరకే నేను అలాంటి చిత్రాలు చాలా చేశాను. మళ్లీ ఆ దారిలో వెళ్లకూడదని నిర్ణయించుకుని ఆ చిత్రానికి నో చెప్పాను. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలూ లేవు ’’ అని చెప్పారు.