ఆ ఇద్దర్నీ ఎప్పటికీ మర్చిపోలేను: సూపర్‌స్టార్ కృష్ణ
‘‘తెలుగులో తొలి కౌబాయ్ సినిమా సహా ఎన్నో ప్రయోగాలు చేసిన ఘనత కృష్ణది. అందుకే, రెబల్‌స్టార్ నేను కాదు కృష్ణే. అతను నిర్మాతల మనిషి మాత్రమే కాదు.. ఏటా 12-14 సినిమాలు చేసి, పరిశ్రమలో కొన్ని వందల కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన గొప్ప వ్యక్తి’’ అని రెబల్‌స్టార్ కృష్ణంరాజు అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల జంటగా ముప్పలనేని శివ దర్శకత్వంలో సాయిదీప్ చాట్ల, వై. బాలురెడ్డి, షేక్ సిరాజ్ సమష్టిగా నిర్మించిన చిత్రం ‘శ్రీశ్రీ’. ఇ.ఎస్. మూర్తి స్వరపరిచిన ఈ చిత్రం పాటలనూ, ప్రచార చిత్రాన్నీ గురువారం హైదరాబాద్‌లో మహేశ్‌బాబు ఆవిష్కరించారు.
హీరోగా కృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) తరఫున అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ శాలువా, సన్మానపత్రంతో కృష్ణను సత్కరించారు. కృష్ణ మాట్లాడుతూ- ‘‘‘తేనెమనసులు’ ద్వారా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారు నన్ను హీరోని చేస్తే, ‘గూఢచారి 116’ ద్వారా నాకు మాస్ ఇమేజ్ తెచ్చి, 50 ఏళ్లు కెరీర్‌ని నడిపే బలం ఇచ్చారు నిర్మాత డూండీ. వారినెప్పటికీ మర్చిపోలేను. ఈ ‘శ్రీశ్రీ’ యాభై ఏళ్ల కెరీర్‌లో ఓ మైలురాయి’’ అన్నారు. ‘‘అందరి కన్నా కృష్ణగారికి అతి పెద్ద అభిమానిని నేనే. నాలుగు నెలల క్రితం ‘శ్రీశ్రీ’లో నాన్న గారి గెటప్ ఫోటో చూసి, ఇప్పుడు ట్రైలర్ చూసి ఎగ్జయిట్ అయ్యా.
చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా? అనిపిస్తోంది’’ అని మహేశ్‌బాబు అన్నారు. విజయనిర్మల మాట్లా డుతూ - ‘‘చాలా ఏళ్ల తర్వాత నేనూ, కృష్ణగారూ కలసి నటించాం. ఇప్పటివరకూ మేమిద్దరం కలసి 48 సినిమాలు చేశాం. ఇంకా రెండు సినిమాలు చేస్తే.. హాఫ్ సెంచరీ పూర్తి చేసేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పలనేని శివ, సంగీత దర్శకుడు ఇ.ఎస్. మూర్తి, నటులు నరేశ్, హీరో సుధీర్ బాబు, సినీ ప్రముఖులు కోదండరామిరెడ్డి, ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.